‘బిగ్ బాస్’ హౌస్ లో ఇద్దరికి కరోనా?

సెప్టెంబరు 5 నుంచి బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్-5 సందడి చేయబోతోన్న నేపథ్యంలో వీక్షకులు ఆ షో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ హౌస్ లో కరోనా కలకలం మొదలైందని తెలుస్తోంది. హౌస్ లోని ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు కంటెస్టెంట్లను ప్రస్తుతానికి క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్లంతా ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నారు. కానీ, అనూహ్యంగా వారిలో ఇద్దరు కరోనా బారినపడడంతో నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారట. మరి, ఆ ఇద్దరు లేకుండానే షోను ప్రారంభిస్తారా..లేదంటే కొత్త కంటెస్టెంట్లను తీసుకుంటారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు, బిగ్ బాస్ ఐదో సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే భిన్నంగా సీజన్-5 నిర్వహించబోతున్నారట. సెప్టెంబర్‌ 5న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న ఈ షో తొలి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను నాగ్ పరిచయం చేయబోతున్నారు. అయితే, ఈ సారి హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదాని పై సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకరిద్దరు మినహా… దాదాపుగా ఆ కంటెస్టెంట్లే ఫైనల్ అవుతారని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

యాంకర్‌ రవి, లోబో, కార్తీకదీపం ఫేమ్‌ ఉమాదేవి, నటి లహరి షారి, యాంకర్‌ ప్రత్యూష, యానీ మాస్టర్, సిరి హన్మంత్‌, ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక, నటి ప్రియ, నవ్య స్వామి, 7 ఆర్ట్స్ సరయు సుమన్, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, యాంకర్ కమ్ నటి వర్షిణి, ఆట సందీప్ భార్య జ్యోతిల పేర్లు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే, వీరితోపాటు కొత్తగా కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, సింగర్‌ శ్రీరామచంద్ర పేర్లు కూడా రేసులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిలో బిగ్‌బాస్‌ హౌస్ లోకి అడుగుపెట్టబోయేది ఎవరన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.