ప్రభాస్.. నువ్వు మారాలి బాసూ

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసత్వాన్నందుకుని సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభాస్.. ఇప్పుడున్న స్థాయికి చేరుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మ్యాన్లీ లుక్‌తో కెరీర్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రభాస్.. ‘వర్షం’ సినిమాతో మంచి కెరీర్‌కు బాటలు వేసుకున్నాడు. అక్కడ్నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్న అతను.. ‘బాహుబలి’తో ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు.

దేశవ్యాప్తంగా అతడికున్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, మీడియా ఫోకస్ ప్రభాస్ మీద ఉంటోంది. అలాంటపుడు ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అన్నింటికీ మించి తన లుక్స్ విషయంలో ప్రభాస్ ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కానీ ఈ మధ్య ప్రభాస్ లుక్స్ చూస్తే మాత్రం అతను ఏమాత్రం జాగ్రత్త వహించడం లేదనిపిస్తోంది.

మామూలుగా ప్రభాస్ ఆఫ్ ద స్క్రీన్ పెద్దగా మెయింటైనెెన్స్‌తో కనిపించడు. చాలా సింపుల్‌గా బయటికి వచ్చేస్తుంటాడు. ప్రైవేట్ మీటింగ్స్‌లోనూ క్యాజువల్‌గా ఉంటాడు. ఐతే స్టైలింగ్ సంగతి పక్కన పెడితే.. లుక్స్ విషయంలో8 ప్రభాస్ జాగ్రత్తగా లేడని ఈ మధ్య బయటికొస్తున్న ఫొటోల్లో స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రభాస్ 40వ పడికి చేరువయ్యాడు కాబట్టి ‘మిర్చి’లో మాదిరి కనిపించడం కష్టమే. కానీ వర్కవుట్లకు తోడు డైట్, అలవాట్ల విషయంలో జాగ్రత్త వహిస్తే మెరుగైన లుక్‌తో కనిపించడానికి అవకాశముంది. కానీ ప్రభాస్ ఈ విషయాల్లో అంత పర్టికులర్‌గా లేడనిపిస్తోంది తన లుక్స్ చూస్తుంటే.

తాజాగా ముంబయిలో కార్లో ఉన్న ప్రభాస్ ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. అవి చూసి నార్త్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్‌ను. తెలుగు వాళ్లలో కూడా ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్‌కు ఈ ఫొటోలు అవకాశంగా మారాయి. ఈ మధ్య ఇలా ప్రభాస్ లుక్ తేడా కొట్టిన ఫొటోలు మరిన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంత స్టార్ ఇమేజ్ తెచ్చుకుని అందరికీ అసూయ పుట్టే స్థాయిలో ఉన్న ప్రభాస్.. లుక్ విషయంలో జాగ్రత్త వహించకపోతే ఇలా సోషల్ మీడియాకు తరచుగా టార్గెట్ కాక తప్పదు.