బుల్లెట్ బండి వధువు బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!

సోషల్ మీడియానా మజాకానా? అన్నట్లుగా మారింది. గతంలో ఎంతో కష్టపడి.. లక్ తోడైతే తప్పించి స్టార్ స్టేటస్ వచ్చేది కాదు. ఇప్పుడు అందుకు భిన్నం. టాలెంట్ ఉండాలే కానీ.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. దాదాపు నాలుగైదు నెలల క్రితం రిలీజ్ చేసిన బుల్లెట్ బండి పాటకు ఒక మోస్తరు రెస్పాన్స్ వస్తే.. అదే పాటను తన బరాత్ రోజున నడి రోడ్డు మీద కాబోయే భర్త ఎదుట పాడిన పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ దెబ్బకు ఈ పాట ఒక్కసారిగా పాపులర్ కావటమే కాదు.. ఆ వధువు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆమెకొచ్చిన క్రేజ్ ఎంత ఎక్కువన్నది చూస్తే.. తాజాగా ఆమెకు అనుకోని బంఫర్ ఛాన్స్ దక్కించుకుంది.

మంచిర్యాల జిల్లా జిన్నారానికి చెందిన అటవీ ఉద్యోగి కుమార్తె సాయి శ్రీయకు రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్ తో పెళ్లి ఖాయం కావటం తెలిసిందే. ఈ నెల 14న జరిగిన పెళ్లి వేళ.. జానపద గీతమైన బుల్లెట్ బండి పాటకు ఆమె వేసిన డ్యాన్స్ భారీగా వైరల్ కావటమే కాదు.. ఒరిజినల్ పాటకు మరింత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి వేములవాడకు వెళ్లిన ఈ జంటను చూసి అక్కడి వారంతా విపరీతంగా ఎగబడటం.. వారిలో ఫోటోలు తీసుకునేందుకు పడిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. అంతలా వారి ఇమేజ్ పెరిగిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే.. ఈ బుల్లెట్ పాటను నిర్మించిన సంస్థ పేరు బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్. దీనికి నిర్వాహకురాలు నిరూప. తాజాగా బుల్లెట్ బండి పాటకు డ్యాన్సు వేసిన వధువుకు ఆమె నేరుగా ఫోన్ చేశారు. తమ సంస్థలో తదుపరి షూట్ చేసే పాటకు నటించాలన్న ఆఫర్ ను ఇచ్చారు. దీంతో.. ఊహించని రీతిలో వచ్చిన ఈ బంఫర్ ఆఫర్ కు కొత్త పెళ్లి కుమార్తె ఓకే చెప్పేసింది. దీంతో.. సాయిశ్రీ ప్రధాన పాత్రగా మరో పాట రానుంది. అనుకోని అవకాశాన్ని తెచ్చిన పెట్టిన సోషల్ మీడియా ఇప్పుడెంత పవర్ ఫుల్ అన్నది అర్థమవుతుందా?