కార్తికేయ ద‌శాబ్దం ప్రేమ‌క‌థ‌


ఆర్ఎక్స్ 100 సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు యువ క‌థానాయ‌కుడు కార్తికేయ‌. అప్ప‌టికే ప్రేమ‌తో మీ కార్తీక్ అనే సినిమాలో న‌టించినా అది విడుద‌లైన సంగ‌తి కూడా చాలామందికి తెలియ‌దు. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించేశాడ‌త‌ను. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేన‌ర్లోనూ అత‌డికి అవ‌కాశం ద‌క్కింది. స‌క్సెస్ రేట్ ఆశించిన స్థాయిలో లేక‌పోయినా కార్తికేయ‌కు అవ‌కాశాలకైతే లోటు లేదు.

ప్ర‌స్తుతం అత‌ను త‌మిళంలో అజిత్ మూవీ వ‌లిమైలో విల‌న్ పాత్ర చేస్తూనే.. తెలుగులో రాజా విక్ర‌మార్క అనే సినిమాలో హీరోగా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిదాకా సినిమా ముచ్చ‌ట్ల‌తోనే వార్త‌ల్లో ఉన్న కార్తికేయ‌.. ఉన్న‌ట్లుండి చ‌డీచ‌ప్పుడు లేకుండా లోహిత అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. ఇంత స‌డెన్‌గా, ఎలాంటి సంకేతాలు లేకుండా నిశ్చితార్థం ఏంటి అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఐతే ఎంగేజ్మెంట్ అనుకోకుండా జ‌రిగింది కానీ.. కార్తికేయ పెళ్లికి ఎప్పుడో రెడీ అయిపోయాడు. త‌న‌కు కాబోయే భార్యతో అత‌డిది సుదీర్ఘ‌మైన ప్రేమ‌క‌థేన‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కార్తికేయ‌నే వెల్ల‌డించాడు. 2010లో వ‌రంగ‌ల్‌లోని నిట్‌లో చ‌దువుకునే రోజుల్లో లోహిత త‌న‌కు ప‌రిచ‌యం అని.. అప్పుడు మొద‌లైన స్నేహం త‌ర్వాత ప్రేమ‌గా మారింద‌ని.. ఒక‌ప్ప‌టి త‌న బెస్ట్ ఫ్రెండే ఇప్పుడు త‌న జీవిత భాగ‌స్వామి కాబోతుండ‌టం చాలా ఆనందంగా ఉంద‌ని కార్తికేయ అన్నాడు. లోహిత‌తో కాలేజీ రోజుల్లో దిగిన పాత ఫొటోను కూడా కార్తికేయ షేర్ చేశాడు. అలాగే ఇప్పుడు నిశ్చితార్థం సంద‌ర్భంగా దిగిన కొత్త ఫోటోను కూడా పంచుకున్నాడు.

ఒక మామూలు కాలేజీ కుర్రాడిగా ఉన్న‌పుడు ప్రేమ‌లో ప‌డి.. దశాబ్దానికి పైగా ఆ బంధాన్ని కొన‌సాగించి.. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాక అదే అమ్మాయితో పెళ్లికి రెడీ అవ‌డం మంచి విష‌య‌మే క‌దా.