మహేష్ సెకండ్ వెంచర్ ఇంకా భారీగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్ల కిందటే థియేటర్ బిజినెస్‌లోకి దిగిన సంగతి తెలిసిందే. ఏషియన్ మూవీస్ అధినేతలతో కలిసి అతను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ట్రెండ్ సెట్టర్ అయింది. మహేష్ బ్రాండ్ బాగా కలిసొచ్చి ఈ మల్టీప్లెక్స్ ఆరంభం నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. హైదరాబాద్‌లో సినీ ప్రేక్షకులు సినిమాలు చూడ్డానికి బాగా ఇష్టపడే మల్టీప్లెక్సుల్లో ఇదొకటి.

చుట్టు పక్కల ప్రాంతాల్లో మూవీ గోయర్స్‌కు ఫస్ట్ ప్రయారిటీగా ఉంటోందీ మల్టీప్లెక్స్. టికెటింగ్ యాప్స్‌లో చాలా వేగంగా బుకింగ్స్ జరిగే మల్టీప్లెక్సుల్లో ఇదొకటి. ప్రసాద్ మల్టీప్లెక్స్ తర్వాత ఎక్కువగా ప్రిమియర్ షోలు వేసేది కూడా ఇక్కడే. ఇటీవలే ‘రాజ రాజ చోర’ ప్రిమియర్ షోను కూడా ఇక్కడే ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఐతే ఏఎంబీ సినిమాస్ మొదలైనపుడే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక మరిన్ని నగరాల్లో ఏఎంబీ సినిమాస్ కొత్త వెంచర్లు రాబోతున్నట్లుగా దీని అధినేతలు ప్రకటన చేశారు.

కానీ ఆ ప్రణాళికల్లో ఉండగానే కరోనా మహమ్మారి వచ్చి అడ్డం పడింది. దీంతో ఆ ప్లాన్లు వాయిదా పడ్డాయి. ఐతే ఏఎంబీ సినిమాస్ సెకండ్ వెంచర్‌కు మాత్రం సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు పనులు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఫినాన్షియల్ డిస్టిక్‌ ప్రాంతంలో ఏఎంబీ సినిమాస్ సెకండ్ వెంచర్ రాబోతోంది. దీన్ని తొలి వెంచర్‌ కంటే భారీగా, లావిష్‌గా తీర్చిదిద్దుతున్నారట. ఇక్కడ స్క్రీన్ల కౌంట్ కూడా ఎక్కువేనట. దీన్ని ఏంఎంబీ సూపర్ ప్లెక్స్‌గా పిలవనున్నారట.

ఇక్కడ స్క్రీన్లు భారీగా ఉంటాయని.. ఇండియాలో బెస్ట్ మల్టీప్లెక్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారని.. ఓపెనింగ్ తర్వాత ఇది కూడా ట్రెండ్ సెట్టర్ కావడం ఖాయమని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గుదలను బట్టి తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరాలు.. అలాగే వేరే రాష్ట్రాల సిటీల్లో కూడా ఏఎంబీ సినిమాస్ కొత్త వెంచర్లను మొదలుపెట్టాలని చూస్తున్నారట.