టాలీవుడ్లో వేడి మొదలైంది


కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం అయితే తెరుచుకున్నాయి కానీ.. అనుకున్నంతగా సందడి అయితే లేదు. తొలి రెండు వారాల్లో చిన్న స్థాయి సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. క్రేజీ సినిమాలు చాలానే విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత మంచి ఫలితం రాదేమో అన్న సందేహంతో చాలామంది నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.

నారప్ప, మ్యాస్ట్రో, టక్ జగదీష్ లాంటి క్రేజీ సినిమాలు ఓటీటీ బాట పట్టడం కూడా ఇందులో భాగమే. మిగతా చిత్రాలను థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని చూస్తున్నారు కానీ.. లోలోన సందేహాలు వెంటాడుతున్నాయి. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ, సెకండ్ షోలకు అనుమతి లేకపోవడం కూడా ఈ భయానికి కారణమే. ఐతే ఈ వారం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత.. తన భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘పాగల్’ చిత్రాన్ని థియేటర్లలోకి దించేస్తుండటంతో టాలీవుడ్లో వేడి మొదలైనట్లే కనిపిస్తోంది.

తర్వాతి వారాల నుంచి క్రేజీ సినిమాలు ఒక్కొక్కటిగా వరుస కట్టేసేలా ఉన్నాయి. ఇప్పటికే ఆగస్టు 19వ తేదీకి శ్రీ విష్ణు సినిమా ‘రాజ రాజ చోర’ ఖరారైంది. అదే రోజు శ్రీముఖి చిత్రం ‘క్రేజీ అంకుల్స్’ కూడా రాబోతోంది. తర్వాతి వారానికి తాజాగా సుధీర్ బాబు చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ను ఖాయం చేశారు. ఇది మంచి అంచనాలున్న సినిమానే. ఇక సెప్టెంబరు 3న మారుతి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ని రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

ఈ నెలాఖరుకి అప్పటికి రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయని, ఏపీలో టికెట్ల రేట్ల గొడవా తెగిపోతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సెప్టెంబరులో మరిన్ని క్రేజీ సినిమాలు విడుదలయ్యే అవకాశముంది. గోపీచంద్ చిత్రం ‘సీటీమార్’ను సెప్టెంబరు రెండో వారానికి ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. నాగచైతన్య-సాయిపల్లవిల కాంబినేషన్లో శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ని కూడా సెప్టెంబరు ప్రథమార్ధంలోనే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.