ఓ పక్క సోనూ సూద్ కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేపడుతుంటే.. జీవితానికి సరిపడా సంపాదించుకోవడం ఏంటి అనిపిస్తోందా? అతడి కొత్త సంపాదన డబ్బు కాదులెండి. పేరు ప్రఖ్యాతులు. లాక్ డౌన్ వేళ ఎంతోమంది సెలబ్రెటీలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు. కానీ ఈ విషయంలో సోనూకు సాటి వచ్చేవాళ్లెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు.
నేనూ సాయం చేశా అని ప్రచారం చేసుకోవడానికో.. ఒక కంపల్షన్తోనో అతను విరాళాలు ఇవ్వలేదు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. నిజమైన తపనతో, మానవత్వంతో అతను స్పందించిన తీరు అందరినీ కదిలిస్తోంది. ముందుగా హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల కోసం తన హోటల్‌ను తెరిచి ఆహార పదార్థాలు అందించడంతో అతను వార్తల్లోకి వచ్చాడు.
ఐతే సోనూలోని మహా మనిషి బయటికి వచ్చింది మాత్రం వలస కార్మికుల కోసం చేసిన సేవతోనే. తమ సామానంతా నెత్తిన పెట్టుకుని పిల్లాపాపల్ని నడిపిస్తూ ఎండల్లో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న వారిని చూసి అతను కదిలిపోయాడు. వారి కోసం ప్రభుత్వ అనుమతులతో బస్సులు ఏర్పాటు చేశాడు. ముందు మూణ్నాలుగు బస్సులు ఏర్పాటు చేయగా.. అతడిని తర్వాత వందల మంది సంప్రదించారు. వాళ్లందరికీ అభయ హస్తం ఇచ్చి ప్రతి ఒక్కరినీ ఇంటికి చేర్చే బాధ్యత తీసుకున్నాడు.
ఒక దశ దాటాక ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారు ప్రభుత్వ సాయం కోసం చూడకుండా సోనూకే తమ బాధ చెప్పుకున్నారు. సోషల్ మీడియాలోనూ అతడికి అభ్యర్థనలు చేశారు. ఐతే ఒక పరిమితి పెట్టుకోకుండా ఎంత మంది తన వద్దకొచ్చినా వాళ్లందరినీ ఇళ్లకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నాడు సోనూ. ఇందుకోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కోట్ల రూపాయల డబ్బు ఇచ్చాడు. ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా ఇళ్లకు చేర్చాడు. దీంతో సోనూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అతడికి అందరూ సలాం కొడుతున్నారు.