విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్లలో ఆయనొకడు. సమరసింహారెడ్డి మొదలుకుని.. బాహుబలి వరకు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. ముఖ్యంగా బాహుబలి, భజరంగి భాయిజాన్ లాంటి సినిమాలతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 77 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా తీరిక లేకుండా పని చేస్తున్నారాయన. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్కు కూడా కథ అందించింది విజయేంద్రనే. జక్కన్న కలల ప్రాజెక్టు మహాభారతంకు కూడా ఆయనే స్క్రిప్టు అందిస్తాడనడంలో సందేహం లేదు. ఐతే రచయితగా ఎంత గొప్ప పేరు సంపాదించినా.. దర్శకుడిగా కూడా రుజువు చేసుకోవాలన్నది విజయేంద్ర ప్రసాద్ కోరిక. ఇందుకోసం గతంలో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
అర్ధాంగి అనే ఫ్లాప్ సినిమాతో దర్శకుడిగా మారిన విజయేంద్ర ప్రసాద్.. తర్వాత శ్రీకృష్ణ 2006తోనూ మెప్పించలేకపోయారు. రాజన్నతో ఓకే అనిపించినా.. తర్వాత శ్రీవల్లి మూవీతో డిజాస్టర్ ఫలితాన్నందించారు. ఈ దెబ్బతో మళ్లీ దర్శకత్వం జోలికి ఆయన వెళ్లరని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఆగట్లేదట. మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నారట. తన రైటింగ్ టీంతో కలిసి ఆయన ఓ కొత్త కథ తయారు చేశారట. ఈసారి కన్నడ, మరో భాష వైపు చూడకుండా ఓ తెలుగు యువ కథానాయకుడితో సినిమా తీయాలని చూస్తున్నారట విజయేంద్ర. ఆయనకు నిర్మాత కూడా దొరికారని.. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా గురించి ప్రకటన చేస్తారని అంటున్నారు. కమర్షియల్గానూ వర్కవుటయ్యే ప్రయోగాత్మక కథతో ఆయన రాబోతున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates