చిరు చెల్లెలిగా కీర్తి.. ప్చ్‌


కొన్ని నెల‌ల కింద‌ట జ‌రిగిన ప్ర‌చార‌మే నిజ‌మ‌వుతున్న‌ట్లుంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించ‌బోతున్న‌ట్లు జోరుగానే వార్త‌లొస్తున్నాయి. కంత్రి, బిల్లా, శ‌క్తి, షాడో చిత్రాల ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌తో చిరంజీవి ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అది త‌మిళ సూప‌ర్ హిట్ వేదాలంకు రీమేక్ అన్న విష‌య‌మూ విదిత‌మే.

త‌మిళంలో అజిత్ హీరోగా న‌టించిన వేదాలంలో హీరోయిన్ని మించి చెల్లెలి పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. అక్క‌డ ల‌క్ష్మీ మీన‌న్ ఆ పాత్ర‌లో న‌టించింది. తెలుగులో ఈ క్యారెక్ట‌ర్ ఎవ‌రు చేస్తారా అన్న ఆస‌క్తి ముందు నుంచి ఉంది. మ‌ధ్య‌లో కొన్ని రోజుల పాటు కీర్తి సురేష్ ఈ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత చ‌ప్పుడు లేదు. కాగా ఈ పాత్ర‌కు కీర్తి ఖ‌రారైన‌ట్లుగా త‌మిళ ప్ర‌ముఖ పీఆర్వోలు తాజాగా ట్విట్ట‌ర్లో వ‌రుస‌బెట్టి పోస్టులు పెడుతున్నారు.

దీన్ని బ‌ట్టి కీర్తినే ఈ స‌మాచారాన్ని మీడియాతో పంచుకుని ఉండొచ్చ‌ని తెలుస్తోంది. సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కీర్తి.. రెగ్యుల‌ర్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమితం కావాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం ‘అన్నాత్తె’లో ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ చేస్తోంది. అందులోనూ ఆమెది హీరోకు చెల్లెలి పాత్రే అంటున్నారు. ఈలోపు వేదాలం రీమేక్‌లో చిరు చెల్లెలి పాత్ర‌కు కీర్తి ఖరారైన‌ విషయం బయటికొచ్చింది.

ఐతే ఈ సినిమా విష‌యంలో చిరు అభిమానులు ఏమంత సంతోషంగా లేరు. రొటీన్ మాస్ సినిమా కావ‌డం.. పైగా మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ అనేస‌రికి వారిలో నిరుత్సాహం క‌నిపిస్తోంది. చిరు చెల్లెలిగా కీర్తి అంటూ వేదాలం రీమేక్ అప్‌డేట్ ప‌ట్ల కూడా చిరు అభిమానులు నెగెటివ్‌గానే స్పందించారు. చిరు అసలీ సినిమా చేయడమే వాళ్లకు ఇష్టం లేకపోవడంతో ఇలా స్పందిస్తున్నట్లుంది. మరోవైపు కీర్తి అభిమానులు సైతం చిరుకు సోదరిగా ఆమె నటించడం పట్ల ఏమంత అసంతృప్తిగా ఉన్నట్లుగా లేరు. వాళ్లు కూడా ఈ అప్‌డేట్ విషయంలో నెగెటివ్ ట్వీట్లే వేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని, చిరు పుట్టిన రోజు దీని ప్రకటన ఉంటుందని వార్తలొస్తున్నాయి.