రంభగా బిగ్ బాస్ బ్యూటీ మోనాల్!

హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసినా రాని క్రేజ్ ను ఒక్క బిగ్ బాస్ షోతో సంపాదించేసింది నటి మోనాల్ గజ్జర్. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ తీరిక లేకుండా గడుపుతోంది. ఈ ఏడాది విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన మోనాల్.. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందని సమాచారం.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ రాబోతుంది. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు. నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, చైతూకి జంటగా కృతిశెట్టిలను తీసుకున్నారు. ఇప్పుడు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

కథ ప్రకారం సినిమాలో స్వర్గం ఎపిసోడ్ ఒకటి ఉంటుందట. ఈ ఫాంటసీ ఎపిసోడ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ‘యమగోల’, ‘యమలీల’ టైపులో ఈ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ ఎపిసోడ్ లో మోనాల్ ఎంట్రీ ఇస్తుందట. స్వర్గంలో రంభగా ఆమె కనిపించబోతుందని సమాచారం. నాగార్జునతో కలిసి మోనాల్ వేసే స్టెప్పులు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఒక్క పాట మాత్రమే కాకుండా కొన్ని మోనాల్ పాత్రకు కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయట. ఆగస్టు 20 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది.