మెగా కుర్రాడి ప్రమోషన్.. సూపర్ హిట్

వరుసగా ఒకటీ రెండూ కాదు.. అరడజను ఫ్లాపులు ఎదుర్కొన్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. హ్యాట్రిక్ హిట్ల తర్వాత మంచి రేంజిలో ఉండగా అతను వరుస పరాజయాలతో కుంగిపోయాడు. ఐతే గత ఏడాది ‘చిత్రలహరి’ సినిమా అతడికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. దాని తర్వాత ‘ప్రతి రోజూ పండగే’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

పాత తప్పులు పునరావృతం కాకుండా తర్వాత జాగ్రత్తగా ఓ ట్రెండీ కథను ఎంచుకుని.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను లైన్లో పెట్టాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రమిది. ‘. పెళ్లి మీద జోకులు మామూలుగా ఎలా పేలుతాయో.. పెళ్లిని వ్యతిరేకించే కుర్రాడి కథలు కూడా వెండితెరపై బాగా ఆడుతుంటాయి. అందుకు ‘మన్మథుడు’ లాంటి సినిమాలే ఉదాహరణ. తేజు సినిమాకు ఆకర్షణీయమైన టైటిల్ పెట్టడమే కాదు.. దీన్ని ప్రమోట్ చేసే విషయంలోనూ తెలివిగా అడుగులు వేస్తున్నారు.

ఆ మధ్య రిలీజ్ చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ టీజర్ భలే ఫన్నీగా అనిపించింది. ఇక లాక్ డౌన్ ముగిసి మళ్లీ సినిమా సందడి మొదలవుతున్న నేపథ్యంలో తేజు.. మళ్లీ తన సినిమా ప్రమోషన్ మొదలుపెట్టాడు. ‘నో పెళ్లి’ పేరుతో ఒక పాట లాంచ్ చేశాడు. ఈ పాటను ఇప్పటికే పెళ్లి కుదిరిన నితిన్‌లో లాంచ్ చేయించడం.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న రానా దగ్గుబాటితో ఈ పాటలో క్యామియో చేయించడం విశేషం. వచ్చే ఏడాది పెళ్లి కొడుకు అయ్యే అవకాశమున్న వరుణ్ తేజ్ కూడా ఇందులో భాగమయ్యాడు.

ఈ యువ కథానాయకులందరిని ఇందులో భాగస్వాముల్ని చేయడమే కాదు.. వాళ్లతో కలిసి ట్విట్టర్లో పెళ్లి గురించి ఆసక్తికర చర్చలు, వాదనలు పెట్టి తేజు భలేగా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. నెటిజన్లందరూ తన సినిమాపై ఓ కన్నేసేలా ఈ ప్రమోషన్లను నడిపిస్తున్నాడు తేజు. ఈ మెగా కుర్రాడి మీద కౌంటర్లు వేస్తూనే మిగతా యంగ్ హీరోలు సినిమాకు చక్కగా ప్రమోషన్ చేసి పెడుతున్నారు. సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్ పరంగా అయితే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సూపర్ హిట్ అని చెప్పాలి.