2.5/5
1 Hr 55 Mins | Love | 30-07-2021
Cast - Teja Sajja, Priya Prakash Varrier, others
Director - SS Raju
Producer - NV Prasad, Paras Jain, Vakada Anjan Kumar
Banner - Super Good Films
Music - Mahathi Swara Sagar
ఓ కథను జడ్జ్ చేయడంలో నిర్మాత పొరపాటు పడొచ్చు. హీరో తప్పు చేయొచ్చు. కానీ ఒక భాషలో వచ్చిన సినిమాను చూసి తెలుగు లో తీయడానికి సరిపోతుందో లేదో అనే నిర్ణయంలో తప్పు జరగడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే మన ప్రేక్షకుల అభిరుచి మన నిర్మాతలకు తెలుసు అనే అనుకోవాల్సి వుంటుంది. థిన్ లైన్ పాయింట్ తో, మరీ ‘రా’ గా తెరకెక్కించిన సినిమాలు మన జనాలకు అంతగా రుచించవు. ముఖ్యంగా మహిళలను దారుణంగా హింసించి, ఇబ్బంది పెట్టే సీన్లను మన తెలుగు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. ఈ విషయాలు అన్నీ విస్మరించి మలయాళ సినిమా ఇష్క ను తీసుకువచ్చి, తెలుగులో రీమేక్ చేసారు సీనియర్ ప్రొడ్యూసర్లు ఎన్వీ ప్రసాద్ అండ్ కో.
ఏకాంతం కోరుకుని లాంగ్ డ్రయివ్ లకో, బీచ్ లకో, నిర్జన ప్రదేశాలకో వెళ్లే ప్రేమజంటలను ఆకతాయిలు అల్లరి పెట్టడం, అఘాయిత్యాలకు పాల్పడడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలాంటి పాయింట్ ను తీసుకుని అల్లిన కథ ఇది. ప్రేమ జంట తేజ-ప్రియ వారియర్ సరదాగా విశాఖ నుంచి విజయనగరం బయలుదేరతారు. ఓ ఆసుపత్రి పార్కింగ్ లో కారు ఆపేసి, ముద్దు ముచ్చట్లకు దిగుతారు. ఆ టైమ్ లో ఇద్దరు వ్యక్తులు పోలీసులమని చెప్పి వాళ్లను నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆ అమ్మాయితో మిస్ బిహేవ్ చేసి, ఆపై వదిలేస్తారు. ఈ నేపథ్యంలో హీరో ఏం చేసాడు అన్నది మిగిలిన సినిమా.
ఇష్క్ సినిమా తొలి సగం ప్రేక్షకుడిని తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. విలన్ పాత్ర ధారి చేతి అతి వ్యవహారం అంతా లాగ్ లా అనిపించి ప్రేక్షకులు హాహా కారాలు చేస్తారు. సాధారణంగా మన ప్రేక్షకులకు హీరో అంటే హీరోనే. కానీ హీరో చేష్టలుడిగి కూర్చుంటే జనాలకు నచ్చదు. పైగా ఈ సినిమాలో హీరో చూడ్డానికే ఇంకా కాలేజీ దాటని కుర్రాడిలా కనిపిస్తాడు. దానికి తోడు బేలతనం. హీరోయిజం లేకపోవడం, ఇంక సినిమా ఎలా రుచిస్తుంది జనాలకు.
సినిమా ఆసుపత్రి పార్కింగ్ లాట్ లోంచి కదలుతుందా? కదలదా? అని ప్రేక్షకుడు అసహనంగా ఎదురుచూస్తుంటే చటుక్కున ఇంటర్వెల్ కార్డ్ పడిపోతుంది. సినిమా ద్వితీయార్థం ప్రారంభమయ్యాక, అలా అలా అటు ఇటు తిరిగి, విలన్ ఇంటికి చేరుకుంటుంది. ఆ చివరి అర్థగంట కాస్త బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రేక్షకులకు కావాల్సిన ఫీల్ అక్కడ దొరకుతుంది. విలన్ ను దెబ్బకు దెబ్బతీయడం కంటే మజా ఏముంటుంది?
సినిమా తొలిసగంలో కీలకమైనవి మూడు పాత్రలు, మలిసగంలో మళ్లీ అలాగే మూడు పాత్రలు, నిడివి పరంగా పెద్దగా ఇబ్బంది వుండదు. ఎటొచ్చీ తొలిసగంలో విలనిజంతో చేసిన సాగదీత వల్లే ఇబ్బంది. దానికి తోడు విలన్ పక్కన ఓ కామెడీ అసిస్టెంట్, అతగాడి ఉత్తరాంధ్ర యాస. అబ్బో ఆ సొగసు సినిమాలో చూడాల్సిందే కానీ వర్ణించసాధ్యం కాదు.
హీరో తేజ కాస్త ఆచి తూచి అడుగువేయాలి. నటన వస్తే సరిపోదు. తగిన వయస్సు, ఫిజిక్ కూడా కావాలి. సినిమా చివరి అరగంట మంచి నటనే కనబర్చాడు. కానీ హీరో మెటీరియల్ అని అనిపించుకోవడానికి మరి కాస్త వయస్సు రావాలి. ప్రియా వారియర్ ఈ సినిమాలో బాగానే వుంది.
ఇష్క్ అనే మాంచి టైటిల్ పెట్టుకుని, ఇది లవ్ స్టోరీ కాదు అని చెబుతూనే సినిమా తీసి, అసలు మన ప్రేక్షకులకు పనికొచ్చే సినిమానే కాదు అని అనిపించుకోవడం అంటే ఏమనుకోవాలి? రెండు గంటల నిడివి వున్న సినిమా అని సంతోషించాలో. అంత త్వరగా ప్రేక్షకుడిని వదిలిపెట్టినందుకు ఆనందించాలో అనే పాయింట్ గురించి ఆలోచిస్తే మాత్రం భలే పాజిటివ్ గా వుంటుంది.
ప్లస్ పాయింట్లు
టైటిల్
మైనస్ పాయింట్లు
సినిమా
ఫినిషింగ్ టచ్.. ఇష్క్..నాట్ ఏ స్క్రీన్ మూవీ
-సూర్య
Gulte Telugu Telugu Political and Movie News Updates