వినాయ‌క చ‌వితికి దృశ్యం-2?


విక్ట‌రీ వెంక‌టేష్ ఈ మ‌ధ్యే పెద్ద సాహ‌సం చేశాడు. త‌న కొత్త చిత్రం నార‌ప్ప‌ను అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయించాడు. వెంకీ స్థాయి హీరో సినిమా తెలుగులో ఓటీటీ ద్వారా రిలీజ్ కావ‌డం ఓ సంచ‌ల‌నం. తెలుగులో థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో రిలీజైన తొలి పెద్ద హీరో సినిమా ఇదే. ఆయ‌న న‌టించిన మ‌రో చిత్రం దృశ్యం-2 కూడా ఓటీటీ రిలీజ్‌కే రెడీ అయిన‌ట్లు చాన్నాళ్ల ముందే వార్త‌లొచ్చాయి.

ఐతే దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం హాట్ స్టార్+డిస్నీ సంస్థ.. దృశ్యం-2ను నేరుగా రిలీజ్ చేయ‌బోతోంద‌ట‌. మంచి రేటుకే డీల్ ఓకే అయిన‌ట్లు స‌మాచారం. తాజా క‌బురేంటంటే.. వినాయ‌క చ‌వితికి కానుగా సెప్టెంబ‌రు రెండో వారంలో దృశ్యం-2 ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంద‌ట‌.

మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో జీతు జోసెఫ్ రూపొందించిన దృశ్యం-2కు ఈ చిత్రం రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల కింద‌ట వ‌చ్చిన దృశ్యం రీమేక్‌లో వెంకీ న‌టించాడు. అప్ప‌ట్లో ఆ సినిమా సూప‌ర్ హిట్ట‌యింది. దృశ్యం-2 మ‌ల‌యాళ వెర్ష‌న్ ఈ ఫిబ్ర‌వ‌రిలో అమేజాన్ ప్రైమ్‌లో రిలీజై మంచి స్పంద‌న తెచ్చుకుంది. కొన్ని రోజుల‌కే తెలుగు రీమేక్‌ను అనౌన్స్ చేశారు.

ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ జీతునే తెలుగులోనూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మీనా వెంకీకి జోడీగా న‌టించింది. దృశ్యంలో కీల‌క పాత్ర‌లు పోషించిన ముఖ్య న‌టీన‌టులంతా ఇందులోనూ న‌టించారు. ఈ సినిమా మొద‌లైన‌పుడే ఓటీటీలో రిలీజ‌వుతుంద‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ఆ వార్త‌లే నిజ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. హాట్ స్టార్ సంస్థ ఇప్ప‌టికే నితిన్ సినిమా మాస్ట్రో ఓటీటీ హ‌క్కులు తీసుకుంది. ఆ చిత్రాన్ని పంద్రాగ‌స్టు కానుక‌గా రిలీజ్ చేస్తార‌ని అంటున్నారు.