పవన్ వచ్చాడు.. ట్రెండ్ అవ్వాల్సిందే

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనివార్య పరిస్థితుల్లో మరోసారి పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. లాక్ డౌన్ అమల్లోకి రావడం, తనకు కరోనా సోకడంతో దాదాపు నాలుగు నెలల పాటు పైగా పవన్ షూటింగ్‌కు దూరంగా ఉన్నాడు. గత నెలలోనే టాలీవుడ్లో షూటింగ్స్ పున:ప్రారంభం కాగా.. పవన్ మాత్రం సెట్లోకి రావడానికి టైం తీసుకున్నాడు.

ఈ నెల 12నే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ పని పున:ప్రారంభిస్తాడని ప్రచారం జరిగింది కానీ.. అది సాధ్యం కాలేదు. ఐతే ఎట్టకేలకు ఈ రోజు, అంటే సోమవారం పవన్ మళ్లీ కెమెరా ఫేస్ చేశాడు.

ఈ రోజే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ పున:ప్రారంభం అయింది. పవన్ ఇలా సెట్లోకి అడుగు పెట్టాడని సమాచారం బయటికి వచ్చిందో లేదో.. ‘పీఎస్పీకే-రానా మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవడం మొదలైంది. చూస్తుండగానే ఇండియా లెవెల్లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది. ముందుగా పవన్ సెట్లో నడిచి వస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది.

తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్వయంగా ఆన్ లొకేషన్ ఫొటో ఒకటి రిలీజ్ చేసింది. పవన్ పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఫొటో అది. పవన్ ముఖం కనిపించకుండా వెనుక నుంచి తీసిన ఈ ఫొటోను షేర్ చేస్తూ పవన్ పాత్ర పేరును వెల్లడిస్తూ అప్‌డేట్ ఇచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్.

ఈ సినిమాలో పవన్ భీమ్‌లా నాయక్‌గా కనిపించనున్నాడట. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పాత్రను ఇందులో పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆ పాత్రధారి ఓ గిరిజిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ హీరోనే గిరిజినుడిగా చూపిస్తున్నారన్నమాట. ఒక స్టార్ హీరో.. హీరోయిజం ఉన్న పాత్ర చేస్తూ ఇలాంటి పేరు పెట్టుకోవడం టాలీవుడ్లో అరుదే.

పవన్‌కు ఇది ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ ఎంపికైన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్లో ఆమె కూడా పాల్గొంటోంది. రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.