20 రోజుల్లో రాసి.. 30 రోజుల్లో తీసేశాడట

టాలీవుడ్లో పరిమిత వనరులతోనే క్వాలిటీ తగ్గకుండా సూపర్ ఫాస్ట్‌గా సినిమాలు తీసే దర్శకుల్లో మారుతి ఒకడు. తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ దగ్గర్నుంచి అతడికి ఇదే బాట. స్క్రిప్టు రాయడంలో, సినిమాలు తీయడంలో అతను చాలా వేగం చూపిస్తుంటాడు.

కాబట్టే తక్కువ సమయంలో చాలా సినిమాలు చేసేశాడు. ఇప్పుడతను రికార్డు వేగంతో ఓ సినిమాను పూర్తి చేశాడు. అదే.. మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రానికి స్క్రిప్టును 20 రోజుల్లోనే పూర్తి చేసేశాడట మారుతి. ఇక షూటింగేమో నెల రోజుల్లో అయిపోయిందట. థియేటర్లు తెరుచుకుని ఉంటే ఈపాటికి సినిమాను కూడా రిలీజ్ చేసేవాళ్లం అంటున్నాడు మారుతి.

20 రోజుల్లో కథ రాసిన తాను.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని.. ఇంకో పది రోజులకు రిలీజ్ చేసేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు అతను ఈ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా వెల్లడించాడు.

తన టీం తన టార్గెట్‌కు అనుగుణంగా అద్భుతంగా పని చేసిందని.. పక్కా ప్లాన్ ప్రకారం సినిమాను పూర్తి చేశామని అతను తెలిపాడు. ‘మంచి రోజులు వచ్చాయి’ ఏదో మామూలుగా రాసి తీసేసిన సినిమా కాదని.. ఈ టైంలో ఈ చిత్రం చాలా అవసరం అని చేసిందని.. నిజానికి ప్రకృతే తమతో ఈ సినిమా చేయించుకుందని మారుతి అన్నాడు.

కరోనా కారణంగా బాధల్లో ఉన్న ప్రేక్షకులకు ఇది ఒక మందు లాంటి సినిమా అని.. తన బలం కామెడీ కాబట్టి.. ఆ కామెడీ మందుతో జనాలకు ఉపశమనం ఇవ్వాలని అనుకున్నానని.. అందుకే ఈ సినిమాకు ‘లాఫింగ్ థెరపీ’ అని క్యాప్షన్ కూడా పెట్టానని మారుతి అన్నాడు.

ఈ చిత్రంలో చాలా చిత్రమైన పాత్రలు ఉంటాయని.. అవి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని మారుతి ధీమా వ్యక్తం చేశాడు. ‘ఏక్ మిని కథ’ను నిర్మించిన యువి కాన్సెప్ట్స్ బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కింది. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించారు. గోపీచంద్‌తో తీస్తున్న ‘పక్కా కమర్షియల్’ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని మారుతి ఈ సినిమాను లాగించేయడం విశేషం.