సాహో ఇప్పుడెందుకు ట్రెండవుతోంది?


ప్రభాస్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటి ‘సాహో’. వసూళ్లు వందల కోట్లలోనే వచ్చి ఉండొచ్చు కానీ.. నష్టాలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాగా దీనికి రిలీజ్ ముంగిట హైప్ మామూలుగా లేదు. కానీ ఆ హైప్‌కు తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తొలి రోజు సాయంత్రానికి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. అంతిమంగా ఇది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా గురించి మాట్లాడ్డానికి ప్రభాస్ కానీ.. చిత్ర బృందంలోని ఇతర ముఖ్యులు కానీ.. పెద్దగా ఇష్టపడరు.

ఐతే సినిమా రిలీజైన రెండేళ్ల తర్వాత ఇప్పుడు అనుకోకుండా #saaho హ్యాష్ ట్యాగ్ గురువారం సాయంత్రం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఇండియా లెవెల్లో టాప్‌లో ‘సాహో’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.

‘సాహో’ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తాజాగా ఒక స్టిల్ రిలీజ్ చేసింది. ‘సాహో అన్ సీన్ పోస్టర్’ అంటూ ఒక అల్ట్రా స్టైలిష్ స్టిల్ వదిలారు. అందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్న ఆ స్టిల్ ప్రభాస్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఒక డిజాస్టర్ మూవీ నుంచి.. అది కూడా సినిమా రిలీజైన రెండేళ్లకు ఓ స్టిల్ వదిలితే అది ట్విట్టర్లో వైరల్ అయిపోవడం.. ఇండియా లెవెల్లో సినిమా పేరు టాప్‌లో ట్రెండ్ కావడం విశేషమే.

ఐతే ఈ స్టిల్ చూసి యువి క్రియేషన్స్ వాళ్లను ట్విట్టర్లో తెగ తిడుతున్న వాళ్లూ లేకపోలేదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అంత క్రేజ్ వస్తే.. ‘సాహో’ లాంటి సినిమా తీసి అభిమానులకు చేదు అనుభవం మిగిల్చారే అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ‘సాహో’ తర్వాత ప్రభాస్, యువి క్రియేషన్స్ కలిసి చక్కగా ‘రాధేశ్యామ్’ చేసుకుంటున్నారు కానీ.. దర్శకుడు సుజీత్ పరిస్థితే చాలా ఇబ్బందికరంగా తయారైంది.