అఫీషియల్.. నయన్ సినిమా ఓటీటీలో

netrikann

కాలానికి అనుగుణంగా ఎవ్వ‌రైనా మారాల్సిందే. అమితాబ్ బ‌చ్చ‌న్, సూర్య‌, వెంక‌టేష్ లాంటి ఆయా ప‌రిశ్ర‌మ‌ల స్టార్ల సినిమాలు థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో నేరుగా రిలీజ‌వుతాయ‌ని ఎవ‌రైనా ఊహించారా? కానీ క‌రోనా కార‌ణంగా త‌ప్ప‌లేదు. ఈ విష‌యంలో ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని చాలా ముందుగానే త‌మ సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కావ‌డానికి అంగీకారం తెలిపిన స్టార్లు కొంద‌రున్నారు.

అందులో న‌య‌న‌తార ఒక‌రు. త‌మిళంలో హీరోల‌తో స‌మానంగా స్టార్ ఇమేజ్ ఉన్న క‌థానాయిక ఆమె. న‌య‌న్ ప్ర‌ధాన పాత్ర పోషించిన మూకుత్తి అమ్మ‌న్ (తెలుగులో అమ్మోరు త‌ల్లి) గ‌త ఏడాది హాట్ స్టార్ ద్వారా నేరుగా రిలీజ్ కావ‌డం తెలిసిందే. ఇప్పుడు ఆమె ప్ర‌ధాన పాత్ర పోషించిన మ‌రో చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఆ సినిమానే.. నేత్రిక‌న్. ఈ చిత్రం కూడా హాట్ స్టార్‌లోనే రిలీజ్ కాబోతుండ‌టం విశేషం.

నేత్రిక‌న్ ఓటీటీలో రానుంద‌ని కొన్ని నెల‌ల ముందు నుంచే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే చిత్ర బృందం నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతో థియేటర్లలోనే సినిమా విడుద‌ల‌వుతుంద‌నుకున్నారు. కానీ ఇప్పుడు హాట్ స్టార్ వాళ్ల‌కు సినిమాను ఇచ్చేశారు. తాము ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు హాట్ స్టార్ గురువారం అధికారికంగా ప్ర‌క‌టించింది. అమ్మాయిల‌ను చిత్ర హింస‌లు పెట్టి చంపే ఒక సైకో కిల్ల‌ర్‌ను వేటాడే అంధురాలి పాత్ర‌లో న‌య‌న్ న‌టించిందీ సినిమాలో. ఆ మ‌ధ్య రిలీజైన దీని టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఇంతకుముందు సిద్దార్థ్ హీరోగా ‘అవల్’ (తెలుగులో గృహం) చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మిలింద్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నయన్‌ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించడమే కాక అన్ని పాటలూ తనే రాశాడు. నయన్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్టే ఉన్న నేపథ్యంలో హాట్ స్టార్ వాళ్లు తెలుగు వెర్ష‌న్‌ను కూడా అందించే అవ‌కాశ‌ముంది.