షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సత్తా చాటుకుని.. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడి.. ఆపై ‘కలర్ ఫొటో’తో హీరో అవతారం ఎత్తాడు యువ నటుడు సుహాస్. ఆ సినిమాలో అతడి పాత్ర, నటన ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించేశాయి. ఆ పాత్ర తాలూకు అమాయకత్వం అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి అమాయకపు కుర్రాడి పాత్రలకు సుహాస్ బాగా సూటవుతాడన్న అభిప్రాయం కలిగింది.
ఐతే ఒక నటుడికి అలా ముద్ర పడిపోవడం కూడా కరెక్ట్ కాదు. అలాంటివే ఒకట్రెండు పాత్రలు చేస్తే తర్వాత అతన్నీ ఆ టైపు క్యారెక్టర్లే వస్తాయి. అందుకే సుహాస్ ఈసారి రూటు మార్చాడు. తన నుంచి ఎవ్వరూ ఊహించని ఓ పాత్రతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అతను సీరియల్ సైకో కిల్లర్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. ఫ్యామిలీ డ్రామా. ఈ టైటిల్ చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రం అనుకుంటాం కానీ.. ఇది సైకో కిల్లర్ చుట్టూ తిరిగే సినిమా కావడం విశేషం.
అనగనగా ఒక సైకో కిల్లర్. అతను చాలా మామూలుగా కనిపిస్తూ.. సైలెంటుగా అత్యంత కిరాతకమైన రీతిలో హత్యలు చేస్తుంటాడు. అతనేంటో తెలియకుండా ఓ కుర్రాడు స్నేహం చేస్తాడు. ఆ కుర్రాడి కుటుంబంలో కొన్ని సమస్యలుంటాయి. ముఖ్యంగా అతడి తండ్రి పెద్ద శాడిస్టు. కుటుంబంలో ఉన్న వాళ్లందరూ అతడి వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య గురించి తెలుసుకుని స్నేహితుడికి సాయంగా ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు సైకో కిల్లర్. ముందుగా అతడి అసలు అవతారం శాడిస్టు తండ్రికి తెలుస్తుంది. తర్వాత ఇంట్లో వాళ్లందరూ ఒక్కొక్కరుగా సైకో కిల్లర్ గురించి తెలుసుకుంటారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. ఆ ఇంట్లో అందరూ చిక్కుకుపోతారు. మరి ఈ సైకో నుంచి తప్పించుకోవడానికి ఆ కుటుంబం ఏం చేసిందన్నది మిగతా కథ.
ట్రైలర్ వరకు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది. సైకో కిల్లర్‌గా సుహాస్ చక్కటి హావభావాలతో ఆకట్టుకున్నాడు. అతడి లుక్ కూడా బాగుంది. మెహర్ తేజ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates