సోదరి కోసం కృతిసనన్ ప్రయత్నాలు!

టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన కృతిసనన్ కి ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సక్సెస్ మీద సక్సెస్ అందుకుంటోంది. దీంతో ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ఆమె చేతుల్లో ఐదు సినిమాలున్నాయి. అందులో ఒకటి ‘ఆదిపురుష్’. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో అమ్మడు క్రేజ్ మరింత పెరగడం ఖాయం.

టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన కృతి ఇప్పుడు తన చెల్లెల్ని హీరోయిన్ గా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. కృతి సోదరి నుపుర్ సనన్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె ఒక మ్యూజిక్ వీడియో ఆల్బమ్ లో నటించింది. అందులో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది. కానీ అది కేవలం ప్రైవేట్ సాంగ్. ఇప్పుడు నుపుర్ కోసం మంచి సినిమాను సెట్ చేసే పనిలో పడింది కృతిసనన్.

ప్రస్తుతం ఈ బ్యూటీ టైగర్ ష్రాఫ్ సరసన ఒక హిందీ సినిమా చేస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించాలి. రెండో హీరోయిన్ పాత్ర కోసం నుపుర్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను కృతి ఖండించింది. తన చెల్లెల్ని సోలో హీరోయిన్ గానే పరిచయం చేయాలని చూస్తుంది కృతిసనన్. ఈ మేరకు తనకు తెలిసిన కొందరు దర్శకనిర్మాతలను సంప్రదిస్తోంది, మరి నుపుర్ కి సరైన కథ సెట్ అవుతుందేమో చూడాలి!