సర్ప్రైజ్.. ఆ బేనర్లో బాలయ్య

Balakrishna

టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణది సపరేటు రూటు. ఆయన పని చేసే దర్శకులు, నిర్మాతల లెక్క వేరుగా ఉంటుంది. బాలయ్య పేరున్న, హ్యాపెనింగ్ బేనర్లలో సినిమాలు చేయడం తక్కువే. ఒకప్పటి సంగతి వేరు కానీ.. గత రెండు దశాబ్దాల్లో ఇది బాగా గమనించవచ్చు. టాప్ దర్శకులకు సైతం దూరంగానే ఉంటారు. ఈ నిర్మాతలు, దర్శకులు బాలయ్య దగ్గరికి రారా.. లేక ఈయనే వాళ్లతో సినిమాలకు ఆసక్తి చూపించడా అంటే చెప్పలేం. ఐతే ఈ మధ్య బాలయ్యలో కొంచెం మార్పు కనిపిస్తోంది. స్టార్ డైరెక్టర్లతో, హ్యాపెనింగ్ బేనర్లతో జట్టు కట్టడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో గోపీచంద్ మలినేని హీరోగా బాలయ్య ఓ సినిమాకు అంగీకారం తెలపడం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. అలాగే అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయడానికి కూడా బాలయ్య రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి.

అనిల్‌తో తన సినిమా ఉంటుందని ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్యే స్వయంగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో టాప్ బేనర్లో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అయిపోయాడు. హారిక అండ్ హాసిని బేనర్లో బాలయ్య సినిమా చేయబోతున్నాడు.

‘ఆదిత్య 369’ చిత్రానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాలయ్య టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వివరిస్తూ హారిక అండ్ హాసిని బేనర్లో సినిమా చేయబోతున్నట్లు బాలయ్య వెల్లడించాడు.

ఎక్కువగా మెగా హీరోలతో సినిమాలు చేసే.. ఆ హీరోలకు అత్యంత సన్నిహితుడైన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌కు ఆస్థాన నిర్మాణ సంస్థలా వ్యవహరించే ఈ బేనర్లో బాలయ్య సినిమా చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే కొంచెం లేటుగా అయినా బాలయ్య ట్రెండుకు తగ్గట్లు నడుచుకుంటుండటం.. ఇలా టాప్ డైరెక్టర్లు, నిర్మాణ సంస్థలతో కలిసి పని చేయబోతుండటం అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే.