ఆదిత్య 369.. ఆయ‌న పుణ్యం


ఆదిత్య 369.. తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో చిర స్థాయిగా నిలిచిపోయే సినిమా. ప్ర‌యోగాత్మ‌క చిత్రాల గురించి ఇప్పుడంద‌రూ మాట్లాడుకుంటున్నారు కానీ.. మూడు ద‌శాబ్దాల కింద‌టే ఇండియాలో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని వినూత్న‌మైన స‌బ్జెక్టుతో ఈ సినిమా తీసి అబ్బుర‌ప‌రిచారు లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయ‌న ప‌నిత‌నానికి నంద‌మూరి బాల‌కృష్ణ అద్భుత న‌ట‌న కూడా తోడ‌వ‌డం, మిగ‌తా టీం అంతా కూడా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వ‌డంతో ఈ సినిమా ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది.

ఇప్పుడు చూసినా చాలా కొత్త‌గా, ఎంతో ఆస‌క్తిక‌రంగా అనిపించే టైమ్ లెస్ క్లాసిక్ ఇది. ఐతే టాలీవుడ్ గ‌ర్వించ‌ద‌గ్గ‌ ఈ గొప్ప ప్ర‌యోగం సాధ్య‌మయింది గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వ‌ల్లే. ఆయ‌నే పూనుకోకుంటే ఈ సినిమా తెర‌కెక్కేదే కాదంటున్నారు సింగీతం.

ఓ హాలీవుడ్ ర‌చ‌యిత టైమ్ మెషీన్ నేప‌థ్యంలో రాసిన ఓ న‌వ‌ల‌ను చ‌దివిన‌ప్ప‌టి నుంచి దాని నేప‌థ్యంలో సినిమా చేయాల‌న్న ఆలోచ‌న త‌న మ‌న‌సులో బ‌లంగా నాటుకుపోయిందని.. ఎన్నో ఏళ్ల పాటు ఆ ఆలోచ‌నను త‌న మ‌న‌సులోనే దాచుకున్నాన‌ని.. ఐతే ఒక సంద‌ర్భంగా బాలుతో క‌లిసి విమానంలో ప్ర‌యాణిస్తున్న‌పుడు ఆయ‌న‌కు ఆదిత్య 369 కాన్సెప్ట్ వినిపిస్తే చాలా ఎగ్జైట్ అయి ఈ సినిమా చేయాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టార‌ని.. త‌ర్వాత నిర్మాత శివ‌లెంక ప్ర‌సాద్‌ను క‌లిసి తాను స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని సింగీతం వెల్ల‌డించారు.

ఐతే బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర చేస్తానంటేనే ఈ సినిమాను తాను తీస్తాన‌ని ముందే కండిష‌న్ పెట్టాన‌ని.. బాల‌య్య అంగీక‌రించ‌డంతో సినిమా ప‌ట్టాలెక్కింద‌ని సింగీతం తెలిపారు. ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాదు.. మేకింగ్ కూడా ద‌గ్గ‌రుండి చూసుకున్నారు బాలు. అలాగే అద్భుత‌మైన పాట‌ల‌తో, అలాగే టిను ఆనంద్‌కు చెప్పిన డ‌బ్బింగ్‌తో సినిమాకు పెద్ద బ‌లంగా నిలిచారు.