గంగూలీపై సినిమా రాబోతోంది


స్పోర్ట్స్ బ‌యోపిక్.. గ‌త ద‌శాబ్ద కాలంలో బాలీవుడ్లో బాగా డిమాండ్ పెరిగిన జాన‌ర్. బాగ్ మిల్కా బాగ్, ఎం.ఎస్.ధోనిః ది అన్ టోల్డ్ స్టోరీ లాంటి చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో క్రీడాకారుల జీవితాల ఆధారంగా వ‌రుస‌బెట్టి బ‌యోపిక్స్ తీసేస్తున్నారు. దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ మీద కూడా స‌చిన్ః ఎ బిలియ‌న్ డ్రీమ్స్ అనే డాక్యుమెంట‌రీ టైపు సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇక క్రికెట‌ర్ల‌లో అంద‌రూ చూడాల‌నుకునే బ‌యోపిక్స్‌లో సౌర‌భ్ గంగూలీది క‌చ్చితంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. దాదా అభిమానులు అత‌డి సినిమా కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ దిశ‌గా అడుగు పడింది. త‌న బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు స్వయంగా గంగూలీనే వెల్ల‌డించ‌డం విశేషం.

త‌న బయోపిక్‌కు అంగీకారం తెలిపాన‌ని.. దీని గురించి చాలా రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుగ‌తున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని.. దీని ద‌ర్శ‌కుడు, ఇత‌ర వివ‌రాలు త‌ర్వాత వెల్ల‌డవుతాయ‌ని గంగూలీ చెప్పాడు. దాదాపు రూ.250 కోట్ల బ‌డ్జెట్‌తో గంగూలీ బ‌యోపిక్ తీయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని.. బాలీవుడ్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ దాదా పాత్ర‌లో న‌టిస్తాడ‌ని బాలీవుడ్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభ‌కోణంతో భార‌త క్రికెట్ కుదేలైన స్థితిలో జ‌ట్టు ప‌గ్గాలు చేప‌ట్టి.. దేశ క్రికెట్ ముఖ‌చిత్రాన్నే మార్చేసిన ఘ‌న‌త గంగూలీదే. అప్ప‌టిదాకా భ‌యం భ‌యంగా ఆడే భార‌త జ‌ట్టులో ధైర్యాన్ని నింపి.. దీటుగా ప్ర‌త్య‌ర్థులను ఎదుర్కొనేలా చేసి.. విదేశాల్లో అద్భుత విజ‌యాలు అందించిన చ‌రిత్ర దాదాది. త‌న‌దైన దూకుడుతో కెప్టెన్సీకి కొత్త అర్థం చెప్పి కోట్లాది అభిమానుల మ‌న‌సులు గెలిచాడు. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ విశేషాల‌కు లోటు లేని దాదా మీద సినిమా స‌రిగ్గా తీస్తే అది బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం ఖాయం.