నారప్ప ఎటూ కాకుండా వస్తున్నాడే..


మొత్తానికి ‘నారప్ప’ విడుదల విషయంలో ఓ స్పష్టత వచ్చేసింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. స్వయంగా వెంకటేషే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ కూడా పెట్టాడు. ఐతే ఈ చిత్రం జులై 23 లేదా 24న వస్తుందని ముందు ప్రచారం జరిగింది.

మామూలుగా కొత్త చిత్రాలు విడుదలయ్యేది శుక్రవారం రోజే. థియేటర్లలో విడుదల చేసినా.. ఓటీటీలో వదిలినా నిర్మాతలు శుక్రవారం సెంటిమెంటును పాటిస్తుంటారు. పండుగలప్పుడు, ఇంకేమైనా విశేషమైన డేట్లు ఉన్నపుడు రోజులు మారుతుంటాయి కానీ.. అలాంటి ప్రత్యేక సందర్భం లేకుంటే శుక్రవారమే కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. కానీ ‘నారప్ప’ను మాత్రం మంగళవారం రోజు రిలీజ్ చేస్తున్నారు.

పేరుకు మంగళవారం కానీ.. ఎప్పట్లాగే అమేజాన్ ప్రైమ్‌లో ముందు రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో సినిమా రిలీజవుతుందని భావిస్తున్నారు. శుక్రవారం సెంటిమెంటు కాదని.. ఇలా ఎటూ కానీ రోజున ‘నారప్ప’ను ఎందుకు రిలీజ్ చేశారో జనాలకు అర్థం కావడం లేదు. బహుశా 23న, శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్న నేపథ్యంలో.. ఎగ్జిబిటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా ఓటీటీ బాట పట్టిన ‘నారప్ప’ సినిమాను అదే రోజు ఓటీటీలో వదలడం బాగుండదని సురేష్ బాబు ముందే సినిమాను ప్రైమ్‌లో వదిలేస్తుండొచ్చు.

అసలు థియేటర్లు తెరుచుకున్నాక ఇలాంటి పెద్ద సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడం కూడా బాగుండదని.. హడావుడిగా ప్రైమ్‌లోకి తెచ్చేస్తున్నట్లుగా ఉంది. ఎగ్జిబిటర్ల అసంతృప్తి నేపథ్యంలో ఎక్కువ హడావుడి చేయకుండా సైలెంటుగా సినిమాను రిలీజ్ చేసేయాలని సురేష్ బాబు చూస్తున్నట్లు సమాచారం.