సుక్కు కొత్త శిష్యుడు.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

ప్ర‌స్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డైన సుకుమార్.. ఇండ‌స్ట్రీలో త‌న చుట్టూ ఒక వ్య‌వ‌స్థ‌నే నిర్మించుకుంటున్నాడంటే అతిశ‌యోక్తి కాదు. మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌ల‌తో క‌లిసి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ఆయ‌న‌.. త‌న శిష్యుల‌ను కూడా వ‌రుస‌బెట్టి ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఇప్ప‌టికే సుక్కు ద‌గ్గ‌ర ప‌ని చేసిన ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్, హుస్సేన్ షా కిర‌ణ్, హ‌రిప్ర‌సాద్ జ‌క్కాతో పాటు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అయ్యారు. ఇంకో ఇద్ద‌రు ముగ్గురికి సినిమాలు సెట్ అవుతున్నాయి.

సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్లో తాజాగా మొద‌లైన క‌ప్పెలా రీమేక్‌తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న శౌరీ చంద్ర‌శేఖ‌ర్ కూడా సుకుమార్ శిష్యుడే. ఆయ‌న అస‌లు పేరు ర‌మేష్‌. ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తూ కొన్ని సెంటిమెంట్ల‌తో, ఫ్యామిలీ మెంబ‌ర్స్ పేర్లు క‌లిసొచ్చేలా శౌరీ చంద్ర‌శేఖ‌ర్ ర‌మేష్ అని పేరు మార్చుకున్నాడు.

ప్రేక్ష‌కుల‌కు ర‌మేష్ కొత్తే కానీ.. ఇండ‌స్ట్రీలో ఆయ‌న‌కు మంచి పేరే ఉంది. ర‌మేష్‌ను ఇండ‌స్ట్రీలో మూవీ ఎన్‌సైక్లోపీడియా అని పిలుస్తారు. ప్ర‌పంచ సినిమాపై ఆయ‌న‌కున్న ప‌ట్టు అసాధార‌ణం అంటారు. ఒక పోలీస్ స్టోరీ తీయాలి అంటే ప్ర‌పంచంలో వివిధ భాష‌ల్లో వ‌చ్చిన బెస్ట్ పోలీస్ సినిమాల స‌మాచారాన్నంతా అప్ప‌టిక‌ప్పుడు చెప్పి అవ‌స‌ర‌మైన రెఫెరెన్స్ ఇవ్వ‌గ‌ల సామర్థ్యం ఆయ‌న సొంత‌మ‌ట‌. ఇలా ఏ జాన‌ర్లో అయినా స‌రే.. ప్ర‌పంచ సినిమా స‌మాచారం అంతా ఆయ‌న ఆశువుగా చెప్పేయ‌గ‌ల‌ర‌ట‌.

సుకుమార్ ర‌మేష్ మీద బాగా ఆధార‌ప‌డ‌తార‌ని.. సినిమాల‌కు సంబంధించి ఏ రెఫ‌రెన్స్ కావాల‌న్నా సుక్కు ఆయ‌న్నే అడుగుతాడ‌ని… ఎన్నో ఏళ్ల నుంచి సుకుమార్ ద‌గ్గ‌ర ర‌మేష్ ప‌ని చేస్తున్నార‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. వేల‌కొద్దీ సినిమాలు చూసిన అనుభ‌వానికి తోడు.. సుకుమార్ శిష్య‌రికం ద్వారా వ‌చ్చిన నైపుణ్యంతో ర‌మేష్ ఎప్పుడో ద‌ర్శ‌కుడు కావాల్సిందని, అయితే అనివార్య కార‌ణాల‌తో ఆల‌స్యం అయింద‌ని.. క‌ప్పెలా రీమేక్‌తో ఎట్ట‌కేల‌కు ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తున్నార‌ని చెబుతున్నారు.