జులై 23న‌ థియేట‌ర్ల రీస్టార్ట్?


తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తేసి రెండు వారాలు దాటింది. థియేట‌ర్లు న‌డుపుకోవ‌డానికి అనుమ‌తి కూడా ఉంది. ఏపీలో కూడా తాజాగా క‌ర్ఫ్యూ ష‌ర‌తులు స‌డ‌లించారు. అయితే రెండు చోట్లా ఇంకా థియేట‌ర్లు పునఃప్రారంభం కాలేదు. గ‌త ఏడాది లాక్ డౌన్ త‌ర్వాత థియేట‌ర్లు తెరిచే విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిట‌ర్లు ఈసారి కూడా అదే ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. థియేట‌ర్ ఇండ‌స్ట్రీ బాగా దెబ్బ తిన్న నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ నుంచి, ప్ర‌భుత్వాల నుంచి మ‌ద్ద‌తు కోరుతున్నారు ఎగ్జిబిట‌ర్లు.

ఓవైపు కొత్త చిత్రాల‌ను నిర్మాత‌లు ఓటీటీల‌కు ఇవ్వ‌డం ఆపేయాల‌ని కోరుతూ.. మ‌రోవైపు క‌రెంటు బిల్లుల ర‌ద్దు, టికెట్ల రేట్ల విష‌యంలో వెసులుబాటు లాంటి డిమాండ్ల‌ను ప్ర‌భుత్వాల ముందు ఉంచుతున్నారు. వీటిపై వ‌చ్చే స్ప‌ష్ట‌త‌ను బ‌ట్టి ఇంకో రెండు వారాల్లో థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

మ‌రి కొన్ని రోజుల్లో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల నుంచి క‌రెంటు బిల్లుల ర‌ద్దు, టికెట్ల రేట్ల‌లో వెసులుబాటుకు సంబంధించి సినీ పెద్ద‌లు లిఖిత పూర్వ‌క విన్న‌పాలు అంద‌జేయ‌నున్నార‌ట‌. అగ్ర నిర్మాత సురేష్ బాబు నార‌ప్ప సినిమా ఓటీటీ డీల్‌ను ర‌ద్దు చేసుకుంటున్నార‌న్న ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఒక‌ట్రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇదే జ‌రిగితే ఓటీటీ డీల్స్ విష‌యంలో మ‌రింత‌మంది వెన‌క్కి త‌గ్గుతార‌ని అంచ‌నా వేస్తున్నారు.

క‌రెంటు బిల్లుల ర‌ద్దు, టికెట్ల రేట్ల విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తే.. ఈ నెల 23న‌, సినిమాల‌కు క‌లిసొచ్చే శుక్ర‌వారం నాడు థియేట‌ర్ల‌ను పునఃప్రారంభిస్తార‌ని అంటున్నారు. తొలి వారం చెప్పుకోద‌గ్గ కొత్త చిత్రాలేమీ రిలీజ్ కాక‌పోవ‌చ్చు. త‌ర్వాతి వారానికి ఆల్రెడీ తిమ్మ‌ర‌సు సినిమా షెడ్యూల్ అయిన సంగ‌తి తెలిసిందే.