భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, కథానాయకుల్లో ఒకడైన దిలీప్ కుమార్ ఈ రోజు కన్ను మూశారు. భారతీయ సినిమా ఎదుగుదలలో ఆయన పాత్ర అత్యంత కీలకం. ‘మొఘల్ ఎ అజామ్’ సహా ఎన్నో అద్భుత చిత్రాల్లో అనితర సాధ్యమైన నటనతో ఆకట్టుకున్నారాయన. ఇండియన్ సినిమా తొలి తరం సూపర్ స్టార్లలో ఆయనొకరు. చాలా ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న దిలీప్ కుమార్.. పదుల సార్లు పరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరారు. కానీ తన పోరాట పటిమతో బయటికి వచ్చారు.
ఇటీవల మరోసారి ఆసుపత్రిలో చేరగా.. ఎప్పట్లాగే కోలుకుని బయటికి వస్తారనుకున్నారు. కానీ ఈసారి మాత్రం ఆయన ఇక చాలనిపించేశారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో భారతీయ సినీ ప్రియులందరూ విషాదంలో మునిగిపోయారు. దిలీప్ కుమార్ కు ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఘనతల్ని గుర్తు చేసుకుంటున్నారు.
దిలీప్ సాధించిన ఘనతలకు తోడు.. ఆయన వదులుకున్న ఘనతల్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. ముఖ్యంగా ఆయన ఓ అరుదైన అవకాశాన్ని కాదనుకున్నారు. ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకుని ఉంటే ప్రపంచ స్థాయిలో తన పేరు మార్మోగేదే. 1962లో విడుదలైన హాలీవుడ్ సినిమా ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’లో నటించే అవకాశం దిలీప్‌కు వచ్చింది. ఈ చిత్రానికి డేవిడ్ లీన్ దర్శకుడు. ఆయనకు భారతీయ సినిమాల గురించి, దిలీప్ కుమార్ ప్రతిభ గురించి బాగానే తెలుసు. ఇందులో ప్రిన్స్ షరీఫ్ అలీ పాత్రను దిలీప్‌కు ఆఫర్ చేశారు.
ఐతే తనకు హాలీవుడ్లో నటించే ఉద్దేశం లేదని దిలీప్ డేవిడ్‌కు తేల్చి చెప్పేశారు. దీంతో ఆ పాత్రను యూరోపియన్ నటుడికి ఇచ్చాడు డేవిడ్. ఐతే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించడమే కాక.. ఆ ఏడాది అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఏకంగా ఏడు ఆస్కార్లను దక్కించుకుంది. ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని ఉంటే హలీవుడ్లో దిలీప్ బిజీ అయిపోయేవాడని అంటుంటారు సన్నిహితులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates