మహేష్ బావ కాదు.. సుధీర్ బాబు


ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. ఈ తరం సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా ఉన్న బ్యాకప్‌తో టాలీవుడ్లోకి హీరోగా అరంగేట్రం చేశాడు సుధీర్ బాబు. కెరీర్లో చాలా ఏళ్లు అతడికి మహేష్ బావగానే గుర్తింపు ఉంది. సరైన విజయాలు లేక, పెర్ఫామెన్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటూ సాగాడతను. కానీ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’.. అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేసిన ‘సమ్మోహనం’ అతడి కెరీర్‌ను మలుపు తిప్పాయి. సుధీర్‌లో మంచి పెర్ఫామర్ ఉన్నాడని చాటి చెప్పిన చిత్రాలివి.

ముఖ్యంగా ‘సమ్మోహనం’తో సుధీర్‌కు ప్రేక్షకుల్లో యాక్సెప్టెన్స్ వచ్చింది. ఈ సినిమాతో వచ్చిన పేరును పోగొట్టుకోకుండా మంచి సినిమాల ఎంపికతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు సుధీర్. ‘నన్ను దోచుకుందువటే’ కూడా అతడికి మంచి ఫలితాన్నే ఇవ్వగా.. ‘వి’ ఫ్లాప్ అయినప్పటికీ సుధీర్ బాబుకు ప్రశంసలు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు సుధీర్ బాబు మంచి అభిరుచి ఉన్న దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కాగా.. ఇంకోటి పలాస డైరెక్టర్ కరుణ్ కుమార్‌తో చేస్తున్న ‘శ్రీదేవి సొడా సెంటర్’. ఇందులో రెండోది చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఇటీవలే డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు సుధీర్.

‘శ్రీదేవి సొడా సెంటర్’కి అంచనాలను మించి బిజినెస్ జరుగుతుండటం విశేషం. దీని పోస్ట్ రిలీజ్ శాటిలైట్, డిజిటల్ హక్కులను రూ.9 కోట్లకు జీ గ్రూప్ సొంతం చేసుకుందట. సుధీర్ బాబు స్థాయికి ఇది చాలా మంచి రేటే. నాన్-థియేట్రికల్ రైట్స్‌తోనే ఈ చిత్రం దాదాపు బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. మొత్తానికి మహేష్ బాబు బావ అనే గుర్తింపు పోయి.. సుధీర్ బాబు సొంతంగా తన ఇమేజ్‌తో సినిమాలను నడిపించే, మంచి బిజినెస్ చేసుకునే స్థాయికి చేరుకోవడం విశేషమే. త్వరలోనే థియేటర్లు పున:ప్రారంభం అవుతుండటంతో పరిస్థితులు కొంచెం చక్కబడ్డాక ‘శ్రీదేవి సొడా సెంటర్’ని విడుదల చేయడానికి చూస్తున్నారు నిర్మాతలు. సుధీర్‌తో ‘భలే మంచి రోజు’ను నిర్మించి 70 ఎంఎం ఎటర్టైన్మెంట్స్ బేనర్లోనే ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.