టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా తక్కువగా ప్రేమకథలు చేసిన హీరో ఎన్టీఆరే. కెరీర్ ఆరంభంలోనే వయసుకు మించిన పాత్రలతో తిరుగులేని మాస్ ఇమేజ్ రావడంతో తారక్ ప్రేమకథల జోలికి పెద్దగా వెళ్లలేదు. అతడిపై మాస్ ముద్ర పడిపోవడంతో పూర్తి స్థాయి ప్రేమకథ చేయడానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రేమకథలు చేసే వయసు కూడా దాటిపోవడంతో ఇక మళ్లీ ఆ జానర్లో నటించే అవకాశమే ఉండదని ఫిక్సయిపోయారంతా. కానీ తమిళ దర్శకుడు అట్లీ తారక్‌ను ఓ ప్రేమకథలో చూపించబోతున్నాడన్నది తాజా సమాచారం.
అట్లీతో తారక్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. కలిసి సినిమా చేయడానికి వీళ్లిద్దరూ ఆసక్తిగానే ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ కాంబినేషన్ సెట్ కావచ్చన్ని చాన్నాళ్లుగానే ప్రచారం జరుగుతోంది.
ఐతే ఇద్దరూ వేర్వేరు కమిట్మెంట్లతో ఉండటంతో సినిమా ఆలస్యం అవుతోంది. ఐతే తాజాగా ఈ కాంబోలో సినిమా దిశగా కదలిక వచ్చినట్లు సమాచారం. ఇటీవలే అట్లీ తారక్‌కు ఓ కథ చెప్పాడట. అది అట్లీ తొలి సినిమా రాజా రాణి తరహాలో ఎమోషనల్ లవ్ స్టోరీ అట. కొంచెం యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నాడట అట్లీ. స్టోరీ లైన్ తారక్‌కు బాగా నచ్చిందని, బౌండ్ స్క్రిప్టుతో రావాలని అట్లీకి చెప్పాడని సమాచారం.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న ఎన్టీఆర్.. తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది. ఈలోపు అట్లీ.. షారుఖ్ ఖాన్ సినిమాను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వీరి కలయికలో సినిమా రావడానికి ఛాన్సుంది. మరి 40వ పడికి చేరువ అవుతున్న దశలో తనకు పెద్దగా పట్టులేని లవ్ స్టోరీ జానర్లో తారక్ ఎలా మెప్పిస్తాడో.. అతణ్ని అట్లీ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates