చ‌ర‌ణ్‌-శంక‌ర్‌ల‌ను క‌లిపింది అత‌నా?


రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమాపై నెల‌కొన్న సందిగ్ధ‌త అంతా తొల‌గిపోయింది. ఈ చిత్రం వ‌చ్చే నెల‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజుతో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ చెన్నైకి వెళ్లి శంక‌ర్‌ను ఆయ‌న ఇంట్లో క‌లిసి వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా స్క్రిప్ట్ ఫైన‌ల్ వెర్ష‌న్‌, అలాగే కాస్ట్ అండ్ క్రూ గురించి చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్ర‌ధాన తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల‌ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌బోతున్నారు.

శంక‌ర్‌ను క‌లిసిన సంద‌ర్భంగా ఆయ‌న‌తో క‌లిసి చ‌ర‌ణ్‌, దిల్ రాజు దిగిన ఫొటోల‌ను కూడా రిలీజ్ చేయ‌డం తెలిసిందే. ఐతే ఒక ఫొటోలో ఈ ముగ్గురు కాకుండా మ‌రో వ్య‌క్తి ఉన్న సంగ‌తి గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇంత కీల‌క‌మైన మీటింగ్‌లో హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌తో క‌లిసి పాల్గొన్న‌ ఆ వ్య‌క్తి ఎవ‌రా అని ఆరా తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారంద‌రూ. ఆ వ్య‌క్తి పేరు.. ఎన్.న‌ర‌సింహారావు.

పేరు చూస్తేనే న‌ర‌సింహారావు తెలుగువాడ‌ని అర్థ‌మైపోతుంది. ఐతే ఇత‌ను శంక‌ర్ ద‌గ్గ‌ర చాలా ఏళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేయ‌డం విశేషం. శంక‌ర్‌తో అత‌డికి మంచి సాన్నిహిత్య‌మే ఉంది. ఆ అనుభ‌వంతోనే కొన్నేళ్ల కింద‌ట ద‌ర్శ‌కుడిగా మారి శ‌ర‌భ అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా నిరాశ ప‌రిచింది. త‌ర్వాత దిల్ రాజు కాంపౌండ్లోకి వ‌చ్చిన న‌ర‌సింహారావు.. ఆయ‌న బేన‌ర్లో వి.వి.వినాయ‌క్ హీరోగా సీన‌య్య అనే సినిమా మొద‌లుపెట్టాడు. కానీ అది అనివార్య కార‌ణాల‌తో మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోయిన‌ప్ప‌టికీ దిల్ రాజు కాంపౌండ్ నుంచి బ‌య‌టికి రాలేదు న‌రసింహారావు.

శంక‌ర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో దిల్ రాజుకు ఆయ‌నతో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చేలా చేసింది న‌ర‌సింహారావే అంటారు. ఇంత‌కుముందే ఇండియ‌న్-2ను ప్రొడ్యూస్ చేసే అవ‌కాశం రాజుకు వ‌చ్చింది. కానీ ఏవో కార‌ణాల‌తో దాన్నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ శంక‌ర్‌తో క‌మిట్మెంట్ మాత్రం వ‌దిలేయ‌లేదు. చ‌ర‌ణ్ హీరోగా ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాను రాజు లైన్లో పెట్టాడు. తాజాగా జ‌రిగిన మీటింగ్‌లోనూ న‌ర‌సింహారావు పాల్గొన‌డాన్ని బ‌ట్టి చూస్తే ఈ ప్రాజెక్టు కోసం తెర‌వెనుక అత‌ను కీల‌క పాత్రే పోషిస్తున్న‌ట్లుంది.