సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం అతడి కొత్త చిత్రం ఒకటి ప్రకటించడం తెలిసిందే. అగ్ర దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బేనర్ మీద కృష్ణ కోమలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వీవీ గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు భగవద్గీత సాక్షిగా అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ పేరుతో ఓ సినిమా రాబోతోందంటూ చాన్నాళ్ల నుంచే టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. దీని దర్శకుడు చాలా చోట్ల ఈ కథను వినిపించాడు.
ఒక దశలో సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. తర్వాత ఆ కథ వేరే కాంపౌండ్లలో తిరిగింది. సాయిధరమ్ తేజ్ ఈ కథ విని సినిమా చేయడానికి బాగా ఆసక్తి చూపించాడు. అతడితో ఈ సినిమా మొదలు కావడమే ఆలస్యం అని ప్రచారం జరిగింది. కానీ ఇంతలో ఏమైందో ఏమో.. తేజు ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. చివరికి ఇప్పుడు సత్యదేవ్ హీరోగా భగవద్గీత సాక్షిగా కథను పట్టాలెక్కించారు. కొరటాల శివ లాంటి పేరున్న దర్శకుడు ఈ కథకు ఆమోద ముద్ర వేసి, ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఇదొక స్పెషల్ ఫిలిం అవుతుందనే అంచనాలున్నాయి.
ఈ స్టోరీ రెవల్యూషనరీగా ఉంటుందని.. ముగింపు ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుందని అంతర్గత వర్గాల సమాచారం. సుశాంత్ సినిమా ఇచట వాహనములు నిలపరాదుకు పని చేసిన సురేష్ బాబా అనే యువ రచయిత ఈ చిత్రానికి స్క్రిప్టు సహకారం అందించాడు. మంచి కథ పడితే దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ నటుడు ఇందులో హీరోగా నటిస్తుండటంతో ఇదొక ప్రామిసింగ్ మూవీ అయ్యే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates