బాహుబలి సినిమాలో హీరో తర్వాత అంత హైలైట్ అయిన పాత్ర అంటే శివగామిదే. ఈ పాత్రలో రమ్యకృష్ణ అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తం ఆమె కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ క్యారెక్టర్ అది. ఈ పాత్రను ఆధారంగా చేసుకుని రచయిత ఆనంద్ నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి పేరుతో ఓ పుస్తకం రాయగా.. అది మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ పుస్తకం ఆధారంగా నెట్ ఫ్లిక్స్.. బాహుబలి పూర్వ కథను వెబ్ సిరీస్‌గా చేయడానికి నాలుగేళ్ల కిందట సన్నాహాలు మొదలుపెట్టింది. కానీ ఒక పట్టాన ఈ సిరీస్ పట్టాలెక్కలేదు.
ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా ఈ ప్రాజెక్టు కోసం కొంత కాలం పని చేసి బయటికి వచ్చేశారు. తర్వాత వేరే టీంను పెట్టుకుని సరికొత్తగా బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమవుతోంది నెట్ ఫ్లిక్స్. ఐతే ఇందులో కీలకమైన శివగామి పాత్రను ఎవరు చేస్తారన్న ఆసక్తి ముందు నుంచి ఉంది.
ఈ క్యారెక్టర్ కోసం అగ్ర కథానాయిక సమంతను సంప్రదించగా.. ఆమె తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. ఐతే సమంత కాకపోయినా ఒక స్టేచర్ ఉన్న వాళ్లే ఈ పాత్రను చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందిరలో ఉంది. కానీ అంతగా పేరు లేని వామిక గబ్బిని శివగామి క్యారెక్టర్ కోసం ఓకే చేసినట్లు వార్తలొస్తుండటం బాహుబలి అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తెలుగులో ‘భలే మంచి రోజు’ చిత్రంలో సుధీర్ బాబు సరసన నటించిన వామికకు తర్వాత ఇక్కడ ఛాన్సులు రాలేదు. తమిళంలో ఒకట్రెండు సినిమాలు చేసి అడ్రస్ లేకుండా పోయింది. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్‌లు, టీవీ షోలేవో చేస్తోంది.
పెద్దగా లైమ్ లైట్లో లేని ఈ అమ్మాయిని అంత పవర్ ఫుల్ పాత్రకు సెలక్ట్ చేయడమేంటని ఇప్పటికే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే తీవ్ర వ్యతిరేకత తప్పదేమో. మరి నెట్ ఫ్లిక్స్ వారి ఆలోచనేంటో?