ఆ ‘బిగ్ బాస్’ ఎవరు.. నరేష్ ప్రశ్న

Naresh

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇంకా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండానే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తదితరులు అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడం.. ప్రకాష్ రాజ్ ఏకంగా తన ప్యానెల్‌నే ప్రకటించేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా మాట్లాడుతూ ‘మా’ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గత నాలుగేళ్లుగా ‘మా’ ప్రతిష్ఠ మసకబారిందని ఆయన వ్యాఖ్యానించడం పట్ల గత రెండేళ్లుగా అధ్యక్షుడిగా ఉన్న నరేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఆయన దీనిపై ప్రెస్ మీట్ పెట్టి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు. కొందరు కావాలనే ఒక హిడెన్ అజెండాతో ‘మా’ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని నరేష్ అనుమానాలు వ్యక్తం చేశారు.

తనను కావాలనే కొంతమందికి శత్రువులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని.. తాను మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయనని ప్రకటించానని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని.. కానీ గత రెండేళ్లలో ఎన్నో మంచి పనులు చేసి ‘మా’ను మంచి స్థితిలో నిలబెడితే.. సంఘం ప్రతిష్ఠ మసక బారిందని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని నరేష్ ప్రశ్నించారు. 900 మంది సభ్యులను కన్‌ఫ్యూజ్‌ చేయాలని చూస్తుంటే.. తాము చేసిన మంచి పనులను తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని నరేష్ అన్నారు.

“ఈ హిడెన్‌ ఎజెండా వెనక ఎవరున్నారు? ‘మా’లో చిచ్చు రేపాలనుకుంటున్న బిగ్‌బాస్‌ ఎవరు?” అంటూ నరేష్ ప్రశ్నించడం గమనార్హం. ‘మా’ సభ్యుల బీమా కోసం తాను సొంత డబ్బులు రూ.14 లక్షలు ఇస్తే చిరంజీవి ఫోన్ చేసి అభినందించారని, కానీ ఆయన తమ్ముడైన నాగబాబు ‘మా’ ప్రతిష్ఠ మసకబారిందంటూ తనను విమర్శించడమేంటని నరేష్ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ పేరెత్తకుండానే.. రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ ‘మా’ కార్యాలయానికి రాని వ్యక్తి, ‘మా’ ఎన్నికల్లో పోటీ పడని వ్యక్తి సంఘం గురించి ఆరోపణలు చేయడం సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని నరేష్ అన్నారు.