ఇప్పుడు టాలీవుడ్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలే హాట్ టాపిక్. ఎలక్షన్లకు ఇంకా మూడు నెలలు సమయం ఉన్నప్పటికీ.. ఈలోపే వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం.. జీవిత, హేమ, సీవీఎల్ నరసింహా రావు లాంటి వాళ్లు కూడా రేసులో నిలవడంతో ఎన్నికలు రంజుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలు వివాదాస్పదం అవుతాయేమో అన్న సంకేతాలు కూడా గోచరిస్తున్నాయి.
గత నాలుగేళ్లలో మా కార్యకలాపాలపై ప్రకాష్ రాజ్, నాగబాబు విమర్శలు చేయడం.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పటికే చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మా ఎన్నికల వ్యవహారంపై స్పందించారు.
ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో వీడియో కాల్ ద్వారా పాల్గొన్న కోట శ్రీనివాసరావు.. మా ఎన్నికలకు సంబంధించి రెండు ప్రశ్నలు సంధించారు. అసలు మా ఎన్నికలను ఎవరు అనౌన్స్ చేశారని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న కమిటీ ఏమైనా ప్రకటించిందా.. ఏదో ప్యానల్ అని అనౌన్స్ చేశారు.. తనకది ఆగ్రహం కలిగించిందని కోట అన్నారు.
ప్రకాష్‌రాజ్‌కు చిరంజీవి మద్దతిచ్చారో.. లేదో.. తనకు తెలియదు.. నాగబాబు కూడా ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కోట అభిప్రాయపడ్డారు. పరభాషా నటుడైన ప్రకాష్ రాజ్‌కు టాలీవుడ్లో పెద్ద పీట వేయడంపై ఒకప్పుడు కోట ఆగ్రహం వ్యక్తం చేయడం.. దర్శకుడు కృష్ణవంశీతో తగువులాడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో పోటీ చేయడంపై కోట అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates