రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఎవరో ఒకరిని గిల్లుతూ వివాదాస్పద ట్వీట్లు వేయడం ఆయనకు అలవాటు. ఐతే కొన్నిసార్లు మాత్రం వర్మ కీలకమైన విషయాల మీద లాజికల్ ట్వీట్లతో జనాల్లో ఆలోచన రేకెత్తిస్తుంటాడు. ఇప్పుడు ఇదే కోవలో ఒక హాట్ టాపిక్ మీద స్పందించాడు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ కొందరు లేవనెత్తిన వాదనను ఆయన తనదైన శైలిలో తిప్పి కొట్టాడు. ఈ వాదనపై ఇప్పటికే ప్రకాష్ రాజ్‌తో పాటు నాగబాబు, బండ్ల గణేష్ లాంటి వాళ్లు బలంగా వాదన వినిపించారు. ఇప్పుడు వర్మ లాజికల్ పాయింట్లతో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే వాళ్ల నోళ్లకు మూత వేయించే పనిలో పడ్డాడు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే.. ఈ కోవలోకి వచ్చే దిగ్గజాలు చాలామందే ఉన్నారని వర్మ ఉదాహరణలు చూపించాడు.
“కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు …బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన బాబు గారు లోకలా??? ఎలా ఎలా ఎలా?? అలాగే మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ? ఎలా? ఎలా? ఎలా?” అని వర్మ ప్రశ్నించాడు.
అంతటితో ఆగకుండా.. “ముప్పై ఏళ్లుగా ప్రకాష్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి, పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా? ప్రకాష్ రాజ్ నటన చూసి నాలుగుసార్లు ఈ దేశం అతడికి శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే ఆయన్ని నాన్ లోకల్ అన్నామంటే అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే.. మీరందరూ ప్రేమించే హీరోయిన్లు అందరూ నాన్ లోకల్. మైకేల్ జాక్సన్ నాన్ లోకల్.. బ్రూస్‌లీ నాన్ లోకల్.. రాముడు సీత కూడా నాన్ లోకల్” అంటూ ఈ వాదనను చాలా దూరం తీసుకెళ్లిపోయాడు వర్మ. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అన్న వాదనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఎదురు దాడి జరిగిన నేపథ్యంలో ఇకపై ఎవరూ ఈ వాదనను తెరపైకి తీసుకురాకపోవచ్చు.