13ఏళ్లుగా నరకం.. బ్రిట్నీ స్పియర్స్ కన్నీటి గాథ..!

పాప్ మ్యూజిక్ గురించి కాస్తో, కూస్తో పరిచయం ఉన్నవారందరికీ బ్రిట్నీ స్పియర్ గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఫేమస్ పాప్ సింగర్.. ఆమె పాట వింటే ఎవరికైనా ఇట్టే ఊపు వచ్చేస్తోంది. ఆమె ఒక్కసారి పాట పాడితే.. రూ.లక్షలు ఇవ్వడానికి ఎంతో మంది రెడీగా ఉంటారు. ఆ సంపాదనతో ఆమె ఎంతో ఆనందంగా గడుపుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే.. తాను గత 13ఏళ్లు గా ఏరోజు ఆనందంగా లేనని.. తన తండ్రి కారణంగా నరకం చూస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

తనకు గార్డియన్ గా.. తన తండ్రిని ఉంచొద్దంటూ.. తనకు రక్షణ కల్పించాలంటూ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పేర్కొనడం గమనార్హం. తన తండ్రి జేమీ స్పియర్స్.. తన జీవితాన్ని నాశనం చేశాడని.. అతని చెర నుంచి రక్షణ కల్పించాలంటూ ఆమె ఆరోపించింది.

తన గార్డియన్ హోదా నుంచి తండ్రి జేమీని తప్పించాలంటూ బ్రిట్నీ… కాలిఫోర్నియా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్‌ మీద వాదనలు జరగ్గా.. 20 నిమిషాలపాటు ఏకధాటిన బ్రిట్నీ, జడ్జి ముందు కన్నీళ్లతో తన గొడును వెల్లబోసుకుంది. బలవంతంగా ఆయన్ని తన సంరక్షకుడిగా నియమించారని, కానీ, ఆ తర్వాతే తన జీవితం నాశనం అయ్యిందని బ్రిట్నీ వాపోయింది.

తన తండ్రి వల్ల తాను రోజూ నరకం అనుభవించానని ఆమె వాపోయారు. ఇష్టం లేకున్నా గంటల తరబడి పని చేశానని చెప్పారు. డబ్బు, హోదా అన్నీ ఆయనే అనుభవించాడని.. తన సంపాదన లో ఒకటో వంతును కూడా తన ఖర్చులకు ఇవ్వలేదని వాపోయారు.

తన ఫోన్‌ దగ్గరి నుంచి విలువైన కార్డుల దాకా అన్నీ ఆయన కంట్రోల్‌లో ఉండిపోయేవని చెప్పారు. రోజూ తనకు లిథియం డ్రగ్‌ ఎక్కించేవాడని.. తన పిల్లలకు కూడ తనను దూరం చేశాడని ఆరోపించింది. మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనే నా ఆశలకు అడ్డుపడ్డాడని.. ఆయన సంరక్షణ తనకు మంచి కంటే చెడు ఎక్కువగా చేసిందని వాపోయింది. ఒకరకంగా ఇది ‘సెక్స్‌ ట్రాఫికింగ్‌’కి సమానం. ఇకనైనా నా జీవితం నాకు ఇప్పించండి అంటూ బ్రీట్నీ పేర్కొనడం గమనార్హం.