‘మా’ ఎన్నికల బరిలో జీవిత.. ధీమా ఏంటి?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఎన్నడూ లేని రసవత్తర పోర చూడబోతున్నట్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఆయన మీదికి యువ నటుడు మంచు విష్ణు పోటీకి దిగబోతున్నట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మూడు నెలల తర్వాత జరగబోయే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే వీళ్లిద్దరూ పావులు కదులపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రకాష్ రాజ్ ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు మద్దతు సంపాదించారు. చిరు నుంచి కూడా తనకు సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మా’ ఎన్నికల్లో మద్దతు కోసమే కృష్ణను మంచు విష్ణు కలిసినట్లు చెప్పుకుంటున్నారు.

ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల పోటీ గురించి అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో.. ఉన్నట్లుండి అధ్యక్ష ఎన్నికల పోటీలోకి మరో వ్యక్తి రాబోతున్నట్లు న్యూస్ బ్రేక్ కావడం విశేషం. ఆ వ్యక్తి మరెవరో కాదు.. జీవిత. ‘మా’లో ఆమె సుదీర్ఘ కాలంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. గత పర్యాయం ఆమె భర్త రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఐతే అధ్యక్షుడు నరేష్‌తో విభేదాలు రావడం, ఒక మీటింగ్‌లో రాజశేఖర్ తీరు వివాదాస్పదం కావడం ఆయన ఆ తర్వాత ‘మా’ కార్యకపాలాపాలకు దూరం అయ్యారు.

ఐతే ‘మా’ సభ్యుల్లో చాలామందితో జీవిత, రాజశేఖర్‌లకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఒక టైంలో వీళ్లు సొంత ఖర్చుతో ‘మా’ సభ్యులకు విందు ఏర్పాటు చేసి, వివిధ అంశాలపై చర్చించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది కూడా. ఈ నేపథ్యంలో పెద్ద వాళ్ల సపోర్ట్ సంగతెలా ఉన్నా.. తమకు ‘మా’ సభ్యుల నుంచి బాగానే మద్దతు లభిస్తుందని జీవిత భావిస్తుండొచ్చు. చూస్తుంటే మామూలు ఎన్నికలకు దీటుగా ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.