రౌడీది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా?


టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజల తర్వాత ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పెద్ద స్టార్‌గా ఎదిగిన హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. మిగతా ఇద్దరి కంటే కూడా చాలా తక్కువ సమయంలో తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడతను. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా అంగీకరించడం విశేషం. తాను ‘ఖైదీ’తో ఓ స్థాయి అందుకోవడానికి చాలా ఏళ్లు కష్టపడితే.. విజయ్ తక్కువ సమయంలో స్టార్ అయిపోయాడని ఆయన వ్యాఖ్యానించారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు విజయ్ స్టార్ పవర్ ఏంటో చూపించాయి.

ఐతే ఆ తర్వాత అతను తన ఊపును కొనసాగించలేకపోయాడు. డియర్ కామ్రేడ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. ఈ చిత్రాలు విజయ్‌ మార్కెట్‌‌పై గట్టి దెబ్బే కొట్టాయి. ఇప్పుడిక విజయ్ ఆశలన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న ‘లైగర్’ మీదే ఉన్నాయి. ఇది విజయ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

చిత్రీకరణ చివరి దశలో ఉన్న ‘లైగర్’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి చర్చలు జరుపుతున్నారని.. ఈ సినిమాను హోల్‌సేల్‌గా రూ.200 కోట్లకు కొనేయడానికి ఓ సంస్థ చర్చలు జరుపుతోందని తాజాగా మీడియాలో వార్తలొస్తున్నాయి. దీని గురించి విజయ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘లైగర్’కు రూ.200 కోట్ల డీల్ అంటే చాలా తక్కువ అని.. థియేటర్లలో తాను ఇంకా ఎక్కువ రాబట్టగలనని అతను ట్వీట్ వేయడం చర్చనీయాంశమైంది.

ఐతే ట్వీట్ వేయడానికి బాగానే ఉంది కానీ.. నిజంగా రూ.200 కోట్లకు మించి రాబట్టే సత్తా ‘లైగర్’కు ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్‌ది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే విజయ్ చివరి చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పట్టుమని పది కోట్లు రాబట్టలేకపోయింది. పూరి చివరి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద హిట్టే అయినా ఆయన ఫామ్ అయితే ఏమంత బాగా లేదు. విజయ్ మార్కెట్టూ దెబ్బ తింది. ఇలాంటి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏకంగా థియేటర్లలో రూ.200 కోట్లకు పైగా రాబట్టేస్తుందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. మరి విజయ్‌ ఈ సినిమాకు ఇచ్చిన హైప్ ఏమేర నిజమవుతుందో చూడాలి.