ప్రముఖ తెలుగు యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ ఛానెల్ ప్రోగ్రాంలో భాగంగా ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని పేర్కొనడమే ఈ వివాదానికి కారణం. ఇది అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ పోరాడుతున్న ఉద్యమకారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఏడేళ్ల కిందట విభజన తర్వాత వేరే రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించగా.. రెండేళ్ల కిందట వైకాపా సర్కారు వచ్చాక అమరావతి ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వెళ్లడం.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకోవడం తెలిసిందే. ఐతే ఈ నిర్ణయానికి ఇప్పటిదాకా చట్టబద్ధత రాలేదు. రాజధాని మార్పు వ్యవహారం కోర్టులో నలుగుతోంది.
ఇలాంటి టైంలో ప్రదీప్ ఓ ప్రోగ్రాంలో భాగంగా ఏపీ రాజధాని వైజాగ్ అనడం అమరావతి పరిరక్షణ కమిటీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 550 రోజులుగా ఉద్యమం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఉద్యమ కమిటీ సభ్యులతో పాటు అమరావతి మద్దతుదారులు ప్రదీప్‌ను టార్గెట్ చేసుకున్నారు. అతడి ఫోన్ నంబర్ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దానికి వందల మంది ఫోన్లు చేసి ప్రదీప్‌ను ఒక ఆటాడుకున్నట్లు తెలిసింది. దీంతో అతను ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టుకోవాల్సి వచ్చింది.
తన వ్యాఖ్యలు ఎంత మంట పుట్టించాయో అర్థం చేసుకున్న ప్రదీప్.. వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. ఆ షోలో రాష్ట్రం-దాని క్యాపిటల్ ఏంటి అనే ప్రశ్న అడిగే క్రమంలో తాను సిటీ పేరు చెప్పి, ఈ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడిగానని.. ఐతే తనప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతలి వ్యక్తి వేరే ఆన్సర్ ఇవ్వడంతో.. ఈ పూర్తి సంభాషణ తప్పు దోవలో వెళ్లిందని ప్రదీప్ వివరించాడు. ఈ విషయంలో కొందరికి వేరే విధంగా అర్థమవడంతో చాలా బాధ అనిపించిందని.. దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరినైనా బాధ పెట్టినా.. మనస్ఫూర్తిగా తాను క్షమాపణలు చెబుతున్నానని.. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని… ఎవరికీ కించపరిచే ఉద్దేశం లేదని.. ఇలా ఇంకెప్పుడూ చేయనని ప్రదీప్ అన్నాడు.