ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన తెలుగు వెబ్ సిరీస్. ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్‌ల్లో అంతగా భారీతనం కనిపించలేదు. చాలా వరకు సాఫ్ట్ కాన్సెప్ట్స్‌తోనే తెలుగు వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. హిందీలో మీర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ తరహాలో భారీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లు తెలుగులో రాని నేపథ్యంలో.. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ఆ లోటును భర్తీ చేసేలా కనిపించింది. దీని ట్రైలర్ వెబ్ సిరీస్ ప్రియులను బాగా ఆకర్షించింది. ఈ శుక్రవారం ‘ఆహా’లో ఈ సిరీస్‌ను రిలీజ్ చేశారు.
ఐతే ట్రైలర్ ఉన్నంత ఎగ్జైటింగ్‌గా ఈ సిరీస్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. తీసి పడేయదగ్గ సిరీస్ అయితే కాదు కానీ.. అంచనాల్ని అందుకోవడంలో మాత్రం ఇది విఫలమైంది. ముఖ్యంగా ఆరంభ ఎపిసోడ్లలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ఈ సిరీస్.. ఆ తర్వాత గాడి తప్పింది. చివరికి అసంతృప్తినే మిగిల్చింది.
‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’లో బాగా హైలైట్ అయింది తొలి ఎపిసోడ్లో వచ్చే స్టన్నింగ్ ట్విస్టే. పోసాని పాత్రకు ఇచ్చిన ముగింపు ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది. తర్వాతి రెండు ఎపిసోడ్ల వరకు ఈ ఆసక్తిని నిలిపి ఉంచారు. కానీ తర్వాత సిరీస్ గాడి తప్పింది. ఇక ట్రైలర్లో చూపించినట్లే ఇందులో బోలెడన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయి. ‘బిగ్ బాస్’ భామ నందిని రాయ్ ఇందులో స్టన్నింగ్ క్యారెక్టర్ చేసింది. నడి వయస్కుడైన భర్త నుంచి సంసార సుఖం అందక కుర్రాళ్లకు వల విసిరే.. ఓ కుర్రాడితో వైల్డ్ రొమాన్స్ చేసే పాత్రలో ఆమె ఆశ్చర్యానికి గురి చేసింది. నందినితో పాటు ఇంకో అమ్మాయి కూడా బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది.
ఇక ఈ సిరీస్ నిండా బోలెడన్ని బూతులు ఉన్నాయి. మీర్జాపూర్ సక్సెస్ కావడానికి బూతులు కూడా ఓ కారణం అని అర్థం చేసుకుని ఈ సిరీస్ నిండా బూతులు నింపేశారు. ప్రియదర్శి, పోసాని కృష్ణమురళి లాంటి పేరున్న ఆర్టిస్టుల నుంచి బూతులు వినడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఐతే అవసరానికి మించి ఉన్న బూతులు ఒక దశ దాటాక చికాకు పుట్టిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఒకసారి చూడ్డానికి ఓకే అనిపించే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి అయితే కలిగించలేకపోయింది.