పారితోషకాలతో పడగొడుతున్నారా?

ఉన్నట్లుండి తమిళ బడా స్టార్లు తెలుగు దర్శకులు, నిర్మాతలతో జట్టు కడుతుండటం.. వీరి కలయికలో భారీ చిత్రాలు మొదలవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. డబ్బింగ్ చిత్రాల ద్వారా మన మార్కెట్‌ను కొల్లగొట్టాలని తమిళ స్టార్లు చూడటం మామూలే. ఇలా దశాబ్దాల నుంచి జరుగుతోంది. ఐతే ఇప్పుడు తమిళ బడా హీరోలు నేరుగా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. మన దర్శకులు, నిర్మాతలతో జట్టు కడుతున్నారు.

ఇప్పటికే విజయ్.. వంశీ పైడిపల్లి, దిల్ రాజులతో కలిసి ఓ సినిమాకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఓ చిత్రాన్ని ప్రకటించారు. మరోవైపు సూర్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో బోయపాటి శ్రీను ఓ సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ తమిళ స్టార్లను మన తెలుగు నిర్మాతలు భారీ పారితోషకాలు ఆఫర్ చేసి ఇంప్రెస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాళ్ల భాషల్లో కూడా అందుకోని స్థాయిలో రెమ్యూనరేషన్లను వీళ్లు ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంశీ చిత్రానికి విజయ్ తీసుకోబోతున్న పారితోషకం గురించి పెద్ద చర్చే నడిచింది. ఈ చిత్రానికి దాదాపు రూ.80-90 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట విజయ్. ఇప్పటిదాకా తమిళంలో కూడా అతను ఎన్నడూ ఓ సినిమాకు ఇంత మొత్తం తీసుకోలేదు. లాభాల్లో వాటాతో కలిపి రూ.90 కోట్ల దాకా ముట్టేలాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక శేఖర్ కమ్ములతో చేయబోయే సినిమాకు ధనుష్ రూ.50 కోట్ల దాకా తీసుకోబోతున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. అది కూడా అతడి కెరీర్ రికార్డు పారితోషకమే. ఇక సూర్య-బోయపాటి సినిమా ఓకే అయ్యేట్లయితే ఆ చిత్రానికి ఆ హీరో కూడా భారీగానే రెమ్యూనేషన్ తీసుకునే అవకాశముంది. ఇవన్నీ బహుభాషా చిత్రాలు కావడంతో బడ్జెట్లు, బిజినెస్ మామూలు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టే పారితోషకాలు పెంచి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.