మోహన్ బాబు సినిమాకి చిరు ప్రమోషన్!

మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందులో మోహన్ బాబు ఒకరు. బయటకి వీరిద్దరూ ఒకరంటే ఒకరికి పడదన్నట్లు కనిపిస్తారు కానీ నిజ జీవితంలో వీరిద్దరూ మంచి స్నేహితుల్లా మెలుగుతుంటారు. చిరు ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా అక్కడ మోహన్ బాబు కనిపిస్తారు. అలానే మోహన్ బాబు ఇంట్లో ఫంక్షన్స్ కి చిరు హాజరవుతుంటారు. గతంలో ఓ సందర్భంలో చిరు.. ‘మాది టామ్ అండ్ జెర్రీ బంధం’ అంటూ మోహన్ బాబుని ఉద్దేశిస్తూ అన్నారు.

చిరు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను, టీజర్స్ ను మోహన్ బాబు ట్విట్టర్ లో షేర్ చేస్తూ విషెస్ చెబుతుంటారు. ఇప్పుడు మోహన్ బాబు సినిమాకి చిరు తనవంతు సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. దీనికి చిరు తన వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి సాయమే చేయబోతున్నారట.

చిరు వాయిస్ ఓవర్ ను టీజర్ కి మాత్రమే పరిమితం చేయకుండా.. సినిమాలో కూడా వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలన్నింటినీ చిరు వాయిస్ తో పరిచయం చేస్తారట. దీంతో పాటు.. ఈ సినిమా విడుదలకు ముందు ఓ భారీ ఫంక్షన్ ను ఏర్పాటు చేసి.. దానికి మెగాస్టార్ ను ముఖ్య అతిథిగా పిలవాలని మోహన్ బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చి.. పరిస్థితి అనుకూలిస్తేనే ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి చిరు తన స్నేహితుడి సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.