టాలీవుడ్ కోసం ఇంకో ఓటీటీ వస్తోంది


క‌రోనా వేళ థియేట‌ర్లు మూత‌ప‌డి కొత్త సినిమాల విడుద‌ల లేక ఇటు ప‌రిశ్ర‌మ‌, అటు ప్రేక్ష‌కులు నీర‌స‌ప‌డిపోతున్న స‌మయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లే ఆశాదీపంలా మారాయి.అవే లేకుంటే సినిమాలు కుప్ప‌లు కుప్ప‌లుగా పేరుకుపోయాయి. ప్రేక్ష‌కులు సినీ వినోదం లేక అల్లాడిపోయేవాళ్లు. అప్ప‌టికే మంచి ఊపులో ఉన్న అమేజాన్ ప్రైమ్‌, హాట్ స్టార్ లాంటి ఓటీటీల‌కు తోడు నెట్ ఫ్లిక్స్, జీ5, స‌న్ నెక్స్ట్ లాంటి ఓటీటీల‌కూ ఆద‌ర‌ణ పెరిగింది. కొత్త‌గా వ‌చ్చిన తెలుగువారి ఓటీటీ ఆహా కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఇలా ఎన్ని ఓటీటీలు పెరిగితే ప‌రిశ్ర‌మ‌కు అంత మేలు జ‌రుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ప్రేక్ష‌కుల‌కు కూడా బోలెడంత వినోదం అందుతుంది.

ఈ మ‌ధ్యే స్పార్క్ పేరుతో కొత్త ఓటీటీ కూడా రావ‌డం తెలిసిందే. ఇప్పుడు మ‌రో ఓటీటీ తెలుగు వారిని ఆక‌ర్షించేందుకు సిద్ధ‌మైంది. ఐతే ఇదేమీ కొత్త ఓటీటీ కాదు.. ఉత్త‌రాదిన బాగా పాపుల‌ర్ అయిన సోనీ లైవ్.

సోనీ ద‌గ్గ‌ర హిందీలో బోలెడంత కంటెంట్ ఉంది. అలాగే స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్‌లు దానికి ఆద‌ర‌ణ పెంచాయి. ఐతే ఇప్పుడు ద‌క్షిణాదిన పాగా వేయ‌డానికి సోనీ లైవ్ రెడీ అవుతోంది. ఎక్క‌డిక్క‌డ కొత్త సినిమాలు కొంటున్న సోనీ లైవ్.. ఆయా భాష‌ల్లో ఆఫీసులు తెరిచి టీంల‌ను కూడా ఏర్పాటు చేసుకుంటోంది. త‌మిళంలో ధ‌నంజ‌య‌న్ అనే మీడియా మ్యాన్ క‌మ్ ప్రొడ్యూస‌ర్‌ను హెడ్‌ను చేయ‌గా.. తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్‌కు బాధ్య‌తలు అప్ప‌గించింది.

త‌మిళంలో ఇప్ప‌టికే కొన్ని క్రేజీ సినిమాల‌ను సోనీ లైవ్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ కొత్త సినిమాల‌తో పాటు, పాత‌వి కొనే ప్ర‌య‌త్నంలో ఉంది. క‌రోనా దెబ్బ‌కు తెలుగులో ఎన్నో సినిమాలు విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయాయి. ఇలా ఓటీటీలు పెర‌గ‌డం వ‌ల్ల‌ వాటిలో కొన్నింటికి మంచి డీల్స్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి తెలుగులోకి సోనీలైవ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.