ప్రముఖ నటుడు నవాజుద్దీన్ ఫ్యామిలీ దుబాయ్ కి షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. నవాజుద్ధీ భార్య ఆలియా ఇద్దరు పిల్లల్ని తీసుకొని దుబాయ్ కి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. పిల్లల చదువు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో అందరూ ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టారు. ఈ పద్ధతి చాలా మంది పిల్లలపై ప్రభావం చూపుతుంది. తల్లితండ్రులకు కూడా ఆన్ లైన్ క్లాసుల వ్యవహారం నచ్చడం లేదు. కానీ చేసేదేం లేక సైలెంట్ గా ఉంటున్నారు.
అయితే కొందరు మాత్రం దీనికి ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. పిల్లలను విదేశాలకు పంపించి చదివించడానికి సిద్ధమవుతున్నారు. నవాజుద్దీన్ దంపతులు కూడా తమ పిల్లల విషయంలో ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ క్లాసుల వలన పిల్లల ప్రవర్తలో చాలా మార్పొస్తుందని.. అందుకే వాళ్లను స్కూల్ కి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆలియా చెప్పారు. దుబాయ్ లో వారి బందులు ఉన్నారని.. స్కూల్ కి సంబంధించిన అడ్మిషన్ వ్యవహారాలన్నీ వాళ్లే దగ్గరుండి చూసుకున్నారని ఆలియా అన్నారు.
పిల్లలను విదేశాల్లో చదివించాలనే ఆలోచన ఎప్పటినుండో ఉందని.. కరోనా వలన ఆ ప్లాన్ కాస్త ముందుకు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం తను మాత్రమే పిల్లలను తీసుకొని దుబాయ్ కి వెళ్తున్నట్లు చెప్పారు. అప్పుడప్పుడు వర్క్ కోసం, నవాజుద్దీన్ ను కలవడం కోసం ఇండియాకు వస్తుంటానని అలియా అన్నారు. వృత్తిరీత్యా నవాజుద్ధీన్ ముంబైలోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మూడు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి.