బిగ్ బాస్ షోను కొంతమంది విపరీతంగా ఇష్టపడతారు. ఇంకొంతమందేమో అదేం షో అంటారు. ఇలాంటి భిన్నాభిప్రాయాలున్న, కొంచెం వివాదాలతో ముడిపడ్డ షోకు తమిళంలో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడు హోస్ట్‌గా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ ఆ షోను ఆయన తనదైన శైలిలో హోస్ట్ చేసి, అది సూపర్ హిట్ కావడంలో కీలక పాత్ర పోషించారు.
ఓవైపు సినిమా కమిట్మెంట్లు, మరోవైపు పొలిటికల్ కమిట్మెంట్లు ఉన్నప్పటికీ నాలుగేళ్లు దిగ్విజయంగా ఆ షోను నడిపించారు. ఐతే ఐదో పర్యాయం బిగ్ బాస్‌లో కమల్ ఉండబోడంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తుండటం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో కమల్ ‘బిగ్ బాస్’కు టాటా చెప్పేస్తున్నాడని.. ఐదో సీజన్‌కు శింబు హోస్ట్‌గా మారబోతున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఐతే అది నిజం కాదని తాజా సమాచారం.
కమల్ చివరగా ఒకసారి ‘బిగ్ బాస్’ షోను నడిపించబోతున్నారట. కరోనా కారణంగా ఆలస్యమైన ఐదో సీజన్‌ను కూడా ఆయనే హోస్ట్ చేయబోతున్నారట. ఐతే వచ్చే సీజన్ నుంచి మాత్రం కమల్ ‘బిగ్ బాస్’లో కనిపించరని, హోస్ట్ మారడం ఖాయమని అంటున్నారు. ‘బిగ్ బాస్’ నిర్వాహకులకు ఈ విషయాన్ని కమల్ ఇప్పటికే చెప్పేశారట. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుతున్న నేపథ్యంలో త్వరలోనే ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ ప్రక్రియ మొదలవుతుందని.. ఆగస్టులో షో మొదలయ్యే అవకాశముందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ ఘోర పరాభవం చవిచూడగా.. కమల్ స్వయంగా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ కమల్ ఖండించారు. ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నారంటే ఉన్నారు కానీ.. యాక్టివిటీ అయితే లేదు. ఇదే సమయంలో ఆయన వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ‘విక్రమ్’తో పాటు మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను పూర్తి చేసి వేరే సినిమాలు మొదలుపెట్టాలనుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates