నందమూరి అభిమానుల్లో మళ్లీ చిచ్చు


నంద‌మూరి అభిమానుల్లో వ‌ర్గాలున్న మాట వాస్త‌వం. ఎవ‌రు కాద‌న్నా ఎవ‌రు ఔన‌న్నా ఇది నిజం అని ఎప్ప‌టిక‌ప్పుడు రుజువ‌వుతూనే ఉంది. బాల‌కృష్ణ అభిమానులు.. ఎన్టీఆర్ అభిమానులు.. వీళ్లిద్ద‌రి ఉమ్మ‌డి అభిమానులు.. ఇవీ అందులో ఉన్న వ‌ర్గాలు. సినిమాల విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు ఈ వ‌ర్గాలు పెద్ద‌గా ఉండేవి కావు కానీ.. రాజ‌కీయాల ట‌చ్ వ‌చ్చాక ఇవి పెరిగి పెద్ద‌య్యాయి.

2009లో ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్ర‌చారం చేసినంత వ‌ర‌కు ప‌రిస్థితి బాగానే ఉంది కానీ.. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి పాలుకావ‌డం.. తార‌క్ నెమ్మ‌దిగా పార్టీకి, చంద్ర‌బాబు, బాల‌య్య‌ల‌కు దూరం కావ‌డంతో వ‌చ్చింది స‌మ‌స్య‌. ఆ త‌ర్వాత వివిధ సంద‌ర్భాల్లో జ‌రిగిన ప‌రిణామాలు, వ్యాఖ్య‌ల మూలంగా బాల‌య్య‌, తార‌క్ అభిమానుల మ‌ధ్య అంత‌రం పెరుగుతూ వ‌చ్చింది. ఇప్పుడ‌ది పెద్ద అగాథంగా మారే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

రెండేళ్ల కింద‌ట ఏపీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోర‌ప‌రాభ‌వం చవిచూసిన‌ప్ప‌టి నుంచి తార‌క్ పార్టీలోకి రావాల‌న్న డిమాండ్ ఊపందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశంలోనే చాలామంది నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. కానీ పార్టీలో కీల‌కంగా ఉన్న బాల‌య్య కానీ.. అధినేత చంద్ర‌బాబు కానీ అందుకు సుముఖంగా లేన‌ట్లే క‌నిపిస్తోంది. తాజాగా బాల‌య్య ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తార‌క్ పార్టీలోకి వ‌స్తే మైనస్ కూడా కావ‌చ్చంటూ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపాయి. దీని వ‌ల్ల నంద‌మూరి అభిమానుల్లో పెద్ద చిచ్చే ర‌గిలిన‌ట్లు క‌నిపిస్తోంది.

సోష‌ల్ మీడియాలో బాల‌య్య‌, తార‌క్ అభిమానులు వ‌ర్గాలుగా విడిపోయి తెగ కొట్టేసుకుంటున్నారు. ప‌ర‌స్ప‌రం దూషించుకుంటున్నారు. నిన్న‌టిదాకా బాల‌య్య‌ను పొగుడుతూ వ‌చ్చిన కొంద‌రు కూడా యాంటీగా మాట్లాడుతున్నారు. తార‌క్ పట్ల దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. బాలయ్య తాజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తాజాగా ట్విట్ట‌ర్లో ఒక స్పేస్ కూడా పెట్టారు. ఇందులో తార‌క్ ఫ్యాన్స్ త‌మ ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కితే.. బాల‌య్య అభిమానులు కౌంట‌ర్ చేశారు. న్యూట్ర‌ల్‌గా ఉండేవాళ్లు కూడా బాల‌య్య వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి బాల‌య్య వ్యాఖ్య‌ల‌తో నంద‌మూరి అభిమానుల్లో చిచ్చు ర‌గిలిన‌ట్లే క‌నిపిస్తోంది.