తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ప్రస్తావన వస్తే తప్పకుండా తలుచుకోవాల్సిన పేర్లలో ఈవీవీ సత్యనారాయణ ఒకటి. తన గురువు జంధ్యాల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు సినిమాకు కావాల్సినంత కామెడీ డోస్ ఎక్కించిన ఘనత ఆయన సొంతం. ప్రపంచంలో మరే సినీ పరిశ్రమలో లేని విధంగా టాలీవుడ్లో మాత్రమే ఒకే సమయంలో బోలెడంత మంది కమెడియన్లు మనగలిగారంటే.. వాళ్లందరికీ చేతి నిండా అవకాశాలు వచ్చాయంటే అందుకు ఈవీవీనే కారణం.
తన ప్రతి సినిమాలోనూ రెండంకెల సంఖ్యలో కమెడియన్లను పెట్టి వాళ్లందరికీ మంచి పాత్రలిచ్చి ఆద్యంతం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవారాయన. మంచి ఫాంలో ఉండగా, తక్కువ వయసులోనే ఆయన గుండెపోటుతో హఠాన్మరణం పాలవడం తెలుగు ప్రేక్షకులకు తీరని లోటే. ఇప్పుడు టీవీలో ఆయన సినిమా వస్తుంటే.. ఆయన లేని లోటును ఫీలవుతూనే ఉంటారు.
ఈ దిగ్గజ దర్శకుడికి జూన్ 10న 66వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేకంగా నివాళి అర్పించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్‌గా మారిన స్పేసెస్‌లోకి ఈవీవీ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నారు టాలీవుడ్ సెలబ్రెటీలు. #Evvteluguspace పేరుతో బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఈ స్పేస్ నడవనుంది.
ఈవీవీ తనయుడు అల్లరి నరేష్‌తో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మారుతి, గోపీచంద్ మలినేని, కళ్యాణ్ కృష్ణ కురసాల.. రచయిత బీవీఎస్ రవి, లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్ తదితరులు ఈ స్పేస్‌లో పాల్గొనబోతున్నారు. వీళ్లలా చాలామంది ఈవీవీ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్లే. ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లే. కాబట్టి ఈ స్పేస్ ఎంతో ఆసక్తికరంగా సాగే అవకాశముంది. నరేష్ సైతం తన తండ్రి గురించి ఎన్నో అనుభవాలు పంచుకునే ఛాన్సుంది. కాబట్టి ఈవీవీ అభిమానులు తప్పక ఫాలో అవ్వాల్సిన స్పేసే ఇది.
Gulte Telugu Telugu Political and Movie News Updates