త‌మ‌న్నాకు బాధేస్తే శ్రుతికి కాల్ చేసి..

స్టార్ హీరోయిన్లు మామూలుగా ఎవ‌రికి వాళ్లే అన్న‌ట్లుంటారు. ఒక‌రితో ఒక‌రు క్లోజ్‌గా ఉండ‌టం, ప్రొఫెష‌న‌ల్‌గా కాకుండా వ్య‌క్తిగ‌తంగా బాగా ద‌గ్గ‌ర‌వ‌డం అరుదుగా క‌నిపిస్తుంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి వ‌చ్చి వేర్వేరు ఇండ‌స్ట్రీల్లో తీరిక లేకుండా ప‌ని చేయ‌డం ఇందుకు కార‌ణం కావ‌చ్చు. ఐతే కొంత‌మంది స్టార్ హీరోయిన్లు మాత్రం ఇందుకు మిన‌హాయింపుగా నిలుస్తుంటారు. బాగా క్లోజ్ అవుతుంటారు.

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యురాలు శ్రుతి హాస‌న్ ఈ కోవ‌కే చెందుతారు. వాళ్లిద్ద‌రూ చాలా ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. వ్య‌క్తిగ‌తంగా ఇద్ద‌రికీ మంచి అనుబంధం ఉంది. శ్రుతితో స్నేహం గురించి త‌మ‌న్నా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు ఎప్పుడు బాధ‌గా అనిపించినా కాల్ చేసేది శ్రుతికే అని.. ఆమె త‌న‌కు ఎంత‌గానో స్ఫూర్తినిస్తుంద‌ని మిల్కీ బ్యూటీ చెప్పింది.

“నేనెప్పుడైనా బాధ‌లో ఉంటే శ్రుతికే కాల్ చేస్తా. త‌ను ఎప్పుడూ అంత ఉత్సాహంగా ఎలా ఉండ‌గ‌లుగుతుందో అడుగుతుంటా. త‌న‌లా ఉండ‌టం చాలా క‌ష్టం. త‌న ఇంటిని పూర్తిగా శ్రుతినే చూసుకుంటుంది. దాన్ని చ‌క్క‌గా తీర్చిదిద్దుకుంటుంది. ఒంట‌రిగా ఉంటూ క‌ష్ట‌ప‌డి కెరీర్‌ను కొన‌సాగిస్తుంటుంది. అదే స‌మ‌యంలో శ్రుతి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న అభిమానుల‌తో క‌నెక్ట్ అయి ఉంటుంది. చాలా హుషారుగా మాట్లాడుతుంది. ఎప్పుడూ త‌న‌లా స‌ర‌దాగా ఉండ‌టం తేలిక కాదు. అందుకే నేను త‌న నుంచి స్ఫూర్తి పొందుతా” అని త‌మ‌న్నా పేర్కొంది.