పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ముడిపడ్డ ఏ విషయమైనా సోషల్ మీడియాకు ఎక్కిందంటే నెటిజన్ల హంగామా మామూలుగా ఉండదు. పవన్ సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొత్త కబురేదైనా వినిపించినా.. ఏదైనా అరుదైన ఫొటో కనిపించినా ట్విట్టర్ హోరెత్తిపోతుంటుంది. పవన్ తాజా ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐతే ఆ ఫొటోలో అసలైన విశేషం పవన్ కాదు.. అతడి కొడుకు అకీరా నందన్.
చాలా ఏళ్ల నుంచి పుణెలో తల్లి రేణు దేశాయ్ దగ్గరే పెరిగిన అకీరా.. మీడియాలో కనిపించడం చాలా తక్కువ. అతడి వ్యక్తిగత ఫొటోలు కూడా పెద్దగా బయటికి రావు. ఎప్పుడో ఒక ఫొటో బయటికి వచ్చిందంటే.. ఆ రోజు అది ట్రెండింగ్‌లో ఉండాల్సిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అకీరా తండ్రితో కలిసి ఉన్న అరుదైన ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అకీరా ఎంత పొడగరో ఇంతకుముందే అందరూ చూశారు.
గత ఏడాది నిహారిక పెళ్లికి వచ్చినప్పటి ఎయిర్ పోర్ట్ ఫొటోల్లో అతడి ఎత్తు చూసి అందరూ షాకయ్యారు. ఆరడగుల బుల్లెట్ అంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు పవన్ పక్కన అకీరాను చూస్తే తండ్రి కన్నా పొడవుగా కనిపిస్తున్నాడు. గతంతో పోలిస్తే అతడి లుక్ కూడా బాగుంది. కుర్రతనం తగ్గి పెద్దవాడవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘హీరో’ లుక్స్ కనిపిస్తున్నాయి.
చూస్తుంటే అకీరా హీరో కావడానికి సమయం దగ్గరపడ్డట్లే ఉంది. తండ్రి పక్కన చాలా పద్ధతిగా నిలబడ్డ తీరు కూడా అభిమానులను మురిపిస్తోంది. ఈ ఫొటో ట్విట్టర్లోకి రావడం ఆలస్యం.. వైరల్ అయిపోవడం.. అకీరా పేరు నేషనల్ లెవెల్లో ట్రెండ్ కావడం చకచకా జరిగిపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates