కుర్రాడు జాక్ పాట్ కొట్టేశాడు

‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో స్కూల్ జ‌ట్టు కెప్టెన్ పాత్రలో నటించిన కుర్రాడిని చూసి.. ఇత‌నెవ‌రో చాలా స‌హ‌జంగా భ‌లే న‌టిస్తున్నాడే అనిపిచింది ప్రేక్ష‌కుల‌కు. ఆ తర్వాత న‌వ‌దీప్-స్వాతి జంట‌గా న‌టించిన‌ ‘బంగారు కోడిపెట్ట’ అనే సినిమాలోనూ ఆ కుర్రాడు ఆకట్టుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు ఈ కుర్రాడి పేరు సంతోష్ శోభ‌న్ అని, అత‌ను దివంగ‌త ద‌ర్శ‌కుడు శోభ‌న్ త‌న‌యుడని జ‌నాల‌కు తెలియ‌దు.

కానీ ‘తను నేను’ అనే సినిమాతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నపుడు సంతోష్ నేప‌థ్యం అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే ప్ర‌భాస్, మ‌హేష్‌, క‌ష్ణ‌వంశీ, త్రివిక్ర‌మ్ లాంటి ప్ర‌ముఖులు శోభ‌న్ మీద అభిమానంతో సంతోష్‌ను ప్ర‌మోట్ చేశారు. ఐతే ఆ సినిమా స‌రిగా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత సంతోష్ హీరోగా చేసిన పేప‌ర్ బాయ్ సైతం నిరాశ‌కే గురి చేసింది. దీంతో సంతోష్ కెరీర్ ఇక పుంజుకోద‌నే అంతా అనుకున్నారు.

ఐతే దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఏక్ మిని క‌థ సినిమాతో ప‌ల‌క‌రించాడు సంతోష్‌. ఈ గ్యాప్‌లో అత‌ను త‌న లుక్ మార్చుకున్నాడు. న‌ట‌న కూడా మెరుగుప‌రుచుకున్నాడు. ఈసారి ఆషామాషీ సినిమా చేస్తే లాభం లేద‌ని.. యువి క్రియేష‌న్స్ లాంటి పెద్ద బేన‌ర్లో, మేర్ల‌పాక గాంధీ క‌థ‌తో సినిమా సెట్ చేసుకున్నాడు. కార్తీక్ రాపోలు అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఏక్ మిని క‌థ ఇటీవ‌లే అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లై మంచి స్పంద‌న తెచ్చుకుంది. కాన్సెప్ట్ బోల్డ్ అయిన‌ప్ప‌టికీ.. వ‌ల్గారిటీ లేకుండా నీట్‌గా ప్రెజెంట్ చేయ‌డం, కామెడీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న రాబ‌ట్టుకుంటోంది.

ఎట్ట‌కేల‌కు సంతోష్ హీరోగా తొలి హిట్ కొట్టిన‌ట్లే భావించాలి. చాలా రిస్క్‌తో కూడుకున్న ఇలాంటి పాత్ర‌ను ఎంచుకున్నందుకే సంతోష్‌ను అభినందించాలి. అలాగే ఆ పాత్ర‌ను చాలా హుషారుగా చేసుకుపోయి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. విశేషం ఏంటంటే.. సంతోష్ ప్ర‌తిభను గుర్తించి, ఏక్ మిని క‌థ మీద భ‌రోసాతో యువి వాళ్లు ఈ యువ క‌థానాయ‌కుడితో ఒకేసారి మూడు సినిమాల‌కు డీల్ చేసుకున్నార‌ట‌. త‌ర్వాతి రెండు చిత్రాల‌ను కూడా ఆ బేన‌ర్లోనే చేయ‌నున్నాడ‌ట సంతోష్‌. మొత్తానికి ఏక్ మిని క‌థ‌తో ఈ కుర్రాడి ద‌శ తిరిగిన‌ట్లే క‌నిపిస్తోంది.