తండ్రి దర్శకుడిగా పనికి రాడనేసిన రాజమౌళి

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమక కమర్షియల్ సినిమా రైటర్లలో ఒకడిగా పేరు సంపాదించారు విజయేంద్ర ప్రసాద్. తెలుగులో బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, సింహాద్రి, మగధీర, బాహుబలి లాంటి చిత్రాలతో ఆయన కీర్తి ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. హిందీలో భజరంగి, భాయిజాన్, మణికర్ణిక లాంటి సినిమాలతో బాలీవుడ్లోనూ ఆయన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ పాన్ ఇండియా మూవీతో పాటు హిందీలో ‘సీత’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు కూడా ఆయనే రచయిత.

ఐతే రైటర్‌గా ఇంత గొప్ప ట్రాక్ రికార్డున్న విజయేంద్ర.. దర్శకుడిగా మాత్రం సఫలం కాలేకపోయారు. ఆయన డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘శ్రీకృష్ణ 2006’ ఫ్లాప్ అయింది. తర్వాత నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘రాజన్న’ పర్వాలేదనిపించింది. చివరగా ఆయన తీసిన ‘శ్రీవల్లి’ పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టలేదు.

కాగా దర్శకుడిగా తండ్రి చివరి సినిమాను చూసిన రాజమౌళి.. ఆయన దర్శకత్వం చేయడానికి పనికి రాడు అనేశాడట. ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంలో ఆయనీ విషయాన్ని వెల్లడించాడు. ‘రాజన్న’ సినిమా చూసి.. తెలుగులో టాప్ డైరెక్టర్లకు దీటుగా ఈ చిత్రాన్ని డీల్ చేశారంటూ విజయేంద్రను రాజమౌళి ప్రశంసించాడట. కానీ ‘శ్రీవల్లి’ చూశాక మాత్రం ‘మీరు దర్శకుడిగా పనికి రారు’ అని మొహమాటం లేకుండా చెప్పేశాడట రాజమౌళి. బహుశా ఆ మాట విన్నాకే విజయేంద్ర మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదేమో.

ఇక హిందీలో తాను కథ అందించిన సల్మాన్ ఖాన్ సినిమా ‘భజరంగి భాయిజాన్’ సినిమా గురించి చెబుతూ.. ‘పసివాడి ప్రాణం’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాశానని.. తాను ఎస్.ఎస్.కాంచి, మహదేవ్ (మిత్రుడు డైరెక్టర్)లతో కలిసి ‘పసివాడిప్రాణం చూస్తూ’ ఈ కథను కొట్టేద్దామా అని వ్యాఖ్యానించానని.. అందులోని పాయింట్ తీసుకునే ‘భజరంగి భాయిజాన్’ రాశానని విజయేంద్ర సరదాగా వ్యాఖ్యానించారు.